Feb 06,2021 15:51

న్యూఢిల్లీ : ''నన్ను అరెస్ట్‌ చేసిన అనంతరం తీహార్‌ జైలుకి తరలించారు. వేర్వేరు నిరసన ప్రాంతాల నుండి అరెస్ట్‌ చేసిన రైతులను ఉంచిన వార్డ్‌లోనే నన్ను కూడా ఉంచారు. అక్కడి వారందరికీ నా పేరు తెలుసు'' అని జర్నలిస్ట్‌ మణిదీప్‌ పునియా అన్నారు. జైలులో కొందరు రైతులతో మాట్లాడానని.. వారు చెప్పిన విషయాలను నోట్‌ చేసుకున్నానని అన్నారు. తీహార్‌ జైలులో నాతో పాటు అరెస్ట్‌ అయిన రైతులతో మాట్లాడాను. జస్మీందర్‌ సింగ్‌ అనే రైతు తన కాలి మీద ఉన్న గాయాన్ని చూపించారని.. మోడీ సర్కార్‌ వారిని క్రూరంగా బాధించిన తీరుకు చాలా బాధపడ్డానని అన్నారు. వారు చాలా పేద, నిస్సహాయ పరిస్థితుల నుండి వచ్చారని, ఏ కారణం మీద అరెస్టయ్యారో కూడా వారికి తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు వెళ్లిన జస్మీందర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారని చెప్పారు.   ఈ విషయాలన్నీ అక్కడే ఉన్న ఒక పోలీస్‌ అధికారి నుండి పెన్‌ను తీసుకుని కాళ్లపై నోట్‌ చేసుకోవడం ప్రారంభించానని చెప్పారు.

హథ్రాస్‌ ఘటనను రిపోర్ట్‌ చేసేందుకు వెళుతున్న జర్నలిస్ట్‌ సిద్దిఖీ కప్పన్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. వారిని విడిపించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోందని, అయితే ఒక చిరునవ్వుతో.. ఒక కలంతో వారి కథనాలను రిపోర్ట్‌ చేసేందుకు ఎప్పుడూ ముందుండాలని.. అదే జర్నలిజమని మణిదీప్‌ అన్నారు. సింఘు సరిహద్దులో రైతుల ఆందోళనను చిత్రీకరించేందుకు తిరిగి వెళతానని.. తాను చేయాల్సింది ఇంకా ఉందని అన్నారు.

ఢిల్లీలోకి ప్రవేశించాలనుకుంటున్న రైతులపై ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరును.. మరో రిపోర్టర్‌ ధర్మేందర్‌ సహాయంతో చిత్రీకరిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారని మణిదీప్‌ తెలిపారు. ''మణిదీప్‌ పునియా ఇక్కడ ఉన్నారు. అతనిని పట్టుకోండి'' అంటూ మరో పోలీస్‌ అధికారి గట్టిగా అరిచారు. నిరసన వద్ద ఉన్న పోలీసులు రైతులతో పాటు తనను కూడా ఒక గుడారానికి తీసుకెళ్లారని.. అక్కడ పదినిమిషాల పాటు కాళ్లపై తీవ్రంగా కొట్టారని.. ఆ గాయాలు ఇంకా ఉన్నాయని అన్నారు. వారు నన్ను కొడుతూనే నాపేరు అడిగారు. కొంతమంది బిజెపి కార్యకర్తలు స్థానికుల మాదిరిగా దుస్తులు ధరించారని.. రైతులపై రాళ్లు రువ్విన ఘటనను మణిదీప్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన మరుసటి రోజు ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులు తనను వజీరాబాద్‌లోని పాత పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని, అక్కడే కాసేపు ఉండాల్సిందిగా ఆదేశించారని అన్నారు. చలిగా ఉన్నప్పటికీ.. ఫ్యాన్‌ ఆన్‌ చేసి వెళ్లారని.. అక్కడే తనపై ఏ విధంగా తప్పుడు కేసు బనాయించాలో చర్చించుకున్నారని అన్నారు. మణిదీప్‌ను రెడ్‌ లైట్‌ ఏరియాలో వదిలివేయాలని.. అక్కడ నుండి అదుపులోకి తీసుకోవాలని భావించారని అన్నారు.

శరీరంపై ఎక్కువ గాయాలు ఉన్నట్లు నివేదికలో నమోదుచేయవద్దని అంబేద్కర్‌ ఆస్పత్రిలోని మెడికల్‌ ఆఫీసర్‌కు ఢిల్లీ పోలీసులు చెప్పారని మణిదీప్‌ అన్నారు. అతనిని మైనర్‌ కేసులో అరెస్ట్‌ చేశామని.. ఎక్కువ దెబ్బలున్నట్లు నివేదికలో నమోదు చేయవద్దని పోలీసులు మెడికల్‌ అధికారిని ఆదేశించారని.. అయితే పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ప్రతి గాయాన్ని నమోదు చేసిన వైద్యాధికారికి కృతజ్ఞతలని మణిదీప్‌ అన్నారు. బెయిల్‌ పొందేందుకు అవకాశం లేకుండా.. తన రాజ్యాంగ హక్కును కాలరాస్తూ.. జనవరి 31న సెషన్స్‌ కోర్టులో హాజరుపరిచారని .. జడ్జి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారని అన్నారు. కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారని.. తన న్యాయవాది అడిగినపుడు .. రెండు గంటలకంటూ సమాధానమిచ్చిన పోలీసులు.. తెలివిగా గంట ముందుగానే కోర్టుకు తరలించారని మణిదీప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిదీప్‌ను అదుపులో ఉంచాల్సిన అవసరం లేదని.. బెయిల్‌ నిరాకరించేందుకు ఎటువంటి కారణాలు లేనందున బెయిల్‌ మంజూరు చేయడంతో.. ఫిబ్రవరి 2న బెయిల్‌ లభించిందని.. పూచీకత్తు కింద రూ. 25 వేలు బాండ్‌ సమర్పించాల్సిందిగా జడ్జి ఆదేశించారని అన్నారు.

సింఘు సరిహద్దులో రైతుల ఆందోళనలను రిపోర్ట్‌ చేస్తున్న జర్నలిస్ట్‌ మణిదీప్‌ పునియా తప్పుడు కేసులో తనను అరెస్ట్‌ చేసిన అనంతరం జరిగిన పరిణామాలు.. ఆందోళన చేసేందుకు వస్తున్న రైతులను ఢిల్లీ పోలీసులు వేధిస్తున్న తీరును ప్రత్యేకంగా వివరించారు. కాగా, దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించాల్సి వుంది.