Oct 27,2021 23:05

సిపిఎం కృష్ణాజిల్లా తూర్పు కార్యదర్శి ఆర్‌.రఘు
ప్రజాశక్తి - మోపిదేవి :
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని సిపిఎం కృష్ణాజిల్లా తూర్పు కమిటీ కార్యదర్శి ఆర్‌.రఘు పిలుపునిచ్చారు. సిపిఎం మోపిదేవి మండల 7వ మహాసభ స్థానిక దళితవాడలో బుధవారం పార్టీ నాయకులు బండి ఆదిశేషు అధ్యక్షతన జరిగింది. సిపిఎం7వ మండల మహాసభ జరిగింది. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలిలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాసభలో రఘు మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సరళీకత ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు విక్రయిస్తున్నారన్నారు. దేశంలో 60 శాతం జనాభాకు జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని సైతం మూడు నల్ల చట్టాల ద్వారా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు మోడీ ప్రభుత్వం ముందు సాగిన పడటంతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. రాష్ట్ర విభజన హామీలను, ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరిస్తోందన్నారు.
మండల కార్యదర్శి బండి ఆదిశేషు ఎన్నిక
అనంతరం సిపిఎం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా బండి ఆదిశేషు, కమిటీ సభ్యులుగా ఎర్రంశెట్టి సునీల్‌, బెజవాడ నాగేశ్వరరావు, కర్రా వెంకటేశ్వరరావు, సిరివెళ్ల రాజశేఖర్‌, కొమ్ము జయరావు, జి సురేష్‌, బి నిర్మల, నాగమల్లేశ్వరరావు ఎన్నికయ్యారు.