Oct 14,2021 22:46

మోడీ పాలనతో దేశం అతలాకుతల


ప్రజాశక్తి- తిరుపతి సిటీ: నరేంద్ర మోడి పాలనలో దేశం మొత్తం అతలాకుతలం అవుతున్నదని, సంక్షోభానికి నెట్టివేయబడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా రైతు ఉద్యమాన్ని అణచివేయాలని కారుతో రైతులను తొక్కించిన మంత్రి కుమారుడిని అరెస్టు చేసి, రాజభోగాలు కల్పించడం సిగ్గుచేటన్నారు. డిఫెన్స్‌కు సంబంధించిన 41 సంస్థలను 7 కార్పొరేషన్లుగా మార్చి అమ్మివేసేందుకు కుట్ర చేశారన్నారు. లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను వేల కోట్లకు ఆదాని, అంబానిలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుండి ఆదానికి చెందిన పోర్టు ద్వారా హెరాయిన్‌ దిగుమతి అవుతోందన్నారు. ఇతర పోర్టుల ద్వారా ఎక్కడ హెరాయిన్‌ ఎందుకు పట్టుబడలేదని ప్రశ్నించారు. ఆదానికి చెందిన పోర్టును తక్షణం సీజ్‌ చేయడంతోపాటు ఆదానిపై దేహద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, స్వార్ధంతోనే విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతోందన్నారు. బొగ్గు ఉత్పత్తి, దిగుమతిలలో సైతం పెద్ద కుంభకోణం నెలకొందని అన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యను పరిష్కరించకుండా కేంద్రం మరింత జఠిలం చేస్తోందని విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తక్షణం షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలన్నారు. కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలను బడా వ్యక్తులకు అమ్మేందుకు సిద్ధపడుతున్నారని, దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మురళి, నగర కార్యదర్శి విశ్వనాధ్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి పాల్గొన్నారు.