Apr 14,2021 21:29

అమరావతి బ్యూరో: మోడీ పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. అంబేద్కర్‌ 130వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ గాంధీనగర్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో బుధవారం సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అణగారిన వర్గాలకు రక్షణ కల్పించేందుకు విద్య, ఉద్యోగాల్లోనూ చట్ట సభల్లోనూ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిందని మధు అన్నారు. మోడీ పాలనలో దళితులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయని, కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న మనువాద సిద్దాంతాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అంబేద్కర్‌కు నిజమైన నివాళి అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమేనన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌ బాబురావు మాట్లాడుతూ సామాజిక న్యాయం, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. అంబేద్కర్‌ విగ్రహాలు ఆకాశమంత ఎత్తు పెడ్తామని పోటీ పడుతున్న ప్రభుత్వాలు ఆయన ఆశయాలను అధ:పాతాళానికి తొక్కేస్తున్నారన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జి.నటరాజ్‌ మాట్లాడుతూ మోడీ సర్కారు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ పోతోందని, ఫలితంగా దళిత, బహుజనులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన లేకుండా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబివికె కార్యదర్శి మురళీకృష్ణ, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి. క్రాంతి తదితరులు పాల్గన్నారు. ముందుగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, గౌతమ బుద్దుడు, బాబూ జగజ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.