Dec 05,2021 20:43

దేశ సంపదను మెక్కుతున్న కార్పొరేట్లు
మానిటైజేషన్‌, ప్రైవేటీకరణతో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం
ప్రజాస్వామ్య, లౌకికవాద రక్షణకు కమ్యూనిస్టులు పోరాడాలి : బి.వి.రాఘవులు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో/మద్దిలపాలెం :కేంద్రంలోని మోడీ పాలనలో క్రోనీలు తయారై దేశ సంపదలను పందికొక్కుల్లా మేస్తున్నారని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు విమర్శించారు. 'ప్రస్తుత రాజకీయం, ఆర్థిక పరిస్థితులుాకర్తవ్యం' అనే అంశంపై విశాఖలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కమిటీ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్యవక్తగా పాల్గని ప్రసంగించారు. దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు మోడీ దోచుపెడుతున్నారని విమర్శించారు. మానిటైజేషన్‌, ప్రైవేటైజేషన్‌ పేరుతో ప్రభుత్వ సేవలను కార్పొరేట్లకు లీజుకిచ్చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్‌ వర్గ ప్రతినిధిగా ప్రధాని మోడీ వ్యవహరిస్తూ కరోనా కష్టకాలంలోనూ అంబానీ, అదానీల ఆస్తులు పెంచేలా చేశారని అన్నారు. ప్రముఖ జర్నలిస్టు పి.సాయినాథ్‌ అనంతపురం కరువు పరిస్థితులపై 'ప్రతి ఒక్కరూ కరువును ప్రేమిస్తారు' అనే పుస్తకం రాశారని, మోడీ పాలనలో సంపన్నుల ఆస్తి పెరగడంతో 'కరోనాను కూడా ఎలా ప్రేమించారో' పుస్తకం రాయాల్సి ఉందని అన్నారు. దేశంలో 90 రైళ్లను, 400 రైల్వే స్టేషన్లను, కోటీ 20 లక్షల టన్నుల సామర్థ్యంగల గోదాములను, సెల్‌ టవర్లను, డిస్కములను, కేజి బేసిన్‌లోని పైప్‌లైన్లను రిలయన్స్‌కు, పోర్టులు, ఎయిర్‌ పోర్టులను అదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. ఇలా ప్రభుత్వ సేవా రంగాలను కుబేరులకు ఇచ్చేసి దేశ ప్రజలను అమెరికాతో పోటీపడాలనడం హాస్యాస్పదమన్నారు. రూ.3 లక్షల కోట్ల విలువైన ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ను టాటాకు కేవలం రూ.18 వేల కోట్లకే కట్టబెట్టారని విమర్శించారు. ఎల్‌ఐసిలో వాటాల విక్రయానికి, రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 17, 18 తేదీల్లో దేశ వ్యాప్తంగా జరిగే నిరసనల్లో ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పాల్గనాలని పిలుపునిచ్చారు.
పరిశ్రమలను తెరిపిస్తే మేలు
విశాఖలో రాజధాని పెడితే ఇక్కడ భూములను పెద్దపెద్దోళ్లు గద్దల్లా తన్నుకుపోతారు తప్ప, ప్రజలకు లాభం లేదని రాఘవులు అన్నారు. పరిశ్రమలు తెరిపిస్తేనే ఈ ప్రాంతానికి మేలని తెలిపారు. రైతు ఉద్యమం స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరును సాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందునే మోడీ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నారన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని ఆపగలిగితే దేశంలో ప్రైవేటీకరణ మొత్తాన్ని ఆపగలమని పేర్కొన్నారు. విశాఖ పోర్టులో నాలుగు బెర్తులను మానిటైజేషన్‌ కింద ఇచ్చేశారని, స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం ఆలస్యం అవుతోందని మోడీ ముక్కలు ముక్కలుగా ప్లాంట్‌ను అమ్మేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్లాంట్‌కు గుండెకాయలాంటి కోకోవెన్స్‌ బ్యాటరీ 3, 4 విభాగాలను ప్రైవేటీకరించే ఎత్తు వేశారన్నారు. ప్లాంట్‌లో ఏ భాగాన్నీ అమ్మనీయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. దీనిపై అన్ని పార్టీలను తీసుకుని ఢిల్లీకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ వైసిపి అనుసరిస్తోన్న కేంద్ర ప్రభుత్వ అనుకూల వైఖరితో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు. వైసిపి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి వస్తోందన్నారు. జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సిపిఎం నాయకులు బి.ప్రభావతి, ఆర్‌కెఎస్‌వి కుమార్‌, బట్టా ఈశ్వరమ్మ, పద్మావతి, బి.జగన్‌, కెఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.