Nov 26,2020 20:58

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు జమిలీ ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చారు. 'ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు' భారత్‌కు ఎంతో అవసరమని ఆయన చెప్పారు. గుజరాత్‌లోని కెవడియాలో జరుగుతున్న 80వ అఖిల భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సమావేశం ముగింపు సందర్భంగా గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ప్రసంగించారు. 'దేశమంతా ఒకేసారి ఎన్నికలు' అంశం కేవలం చర్చించాల్సిన విషయం మాత్రమే కాదనీ, దేశానికి అవసరం కూడా అని ఆయన నొక్కి చెప్పారు. పదేపదే కొన్ని నెలల పాటు వేర్వేరు చోట్ల ఎన్నికలు జరుగుతూనేవుంటాయని, దీనివల్ల అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. అందువల్ల 'ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు'పై లోతైన అధ్యయనం, చర్చలు జరపడం తప్పనిసరని ప్రధాని చెప్పారు. లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ఒక్కటే ఉండాలని కూడా ఆయన సూచించారు. వేరువేరు ఓటర్ల జాబితాలతో వనరులు దుర్వినియోగం చేయడం ఎందుకుని ప్రశ్నించారు. రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని, 21వ శతాబ్ది సవాళ్లను స్వీకరించడానికి రాజ్యంగమే దారి చూపిస్తుందని తెలిపారు. ముంబయిలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడులను దేశం ఎప్పుడూ మర్చిపోదని పేర్కొన్నారు.