Oct 14,2021 06:54

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే విధంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి లో తన సహచర మంత్రి సుపుత్రుడు రైతులపై వాహనాన్ని నడిపి నలుగురి ప్రాణాలను బలిగొన్న అత్యంత దారుణ సంఘటనపై ఇంతవరకు పెదవి విప్పని ఆయన మానవ హక్కులపై మాట్లాడటమే హాస్యాస్పదం. పోనీ ఆ సందర్భంగానైనా అమానుషాన్ని ప్రస్తావించి విచారం వ్యక్తం చేశారా అంటే అదీ లేదు. ఆ పని చేయకపోగా మానవహక్కులపై కొందరు ఇష్టారీతిన అర్ధాలు తీస్తున్నారని, ఏ చిన్న సంఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘన అంటూ గగ్గోలు పెడతారని, వీటి వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు, ప్రజాస్వామ్యానికి హాని కలుగుతోందని చెప్పారు. ఇంతకూ ఆ చిన్న సంఘటన ఏమిటో... ఆ కొందరు ఎవరో ప్రధాని చెప్పనే లేదు. లఖింపూర్‌ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమై, అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకునేంత వరకు ఏలినవారి ప్రభుత్వంలో నామమాత్రపు స్పందన కూడా కనిపించని వైనాన్ని దేశ ప్రజలందరూ చూశారు. ఆ నిష్క్రియాపరత్వంపై మాట కూడా మాట్లాడని ఆయన మానవహక్కులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించడం ఎంత విచిత్రం!

నరేంద్రమోడీ చుట్టూ మానవహక్కుల చర్చ జరగడం కొత్తేమీ కాదు. ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి సాగుతున్నదదే! కాకపోతే ఎప్పటికప్పుడు తిమ్మినిబమ్మి చేసే టక్కుటమారాలతో ప్రజలను చీల్చి ఏమార్చడం సంఫ్‌ుపరివారానికి వెన్నతో పెట్టిన విద్య! ఆ కుదురు నుండే వచ్చిన మోడీ ప్రధాని హోదాలో సైతం ఆ విద్యను ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతాంగం చేస్తున్న ఉద్యమం, దానికి దేశ వ్యాప్తంగా లభిస్తున్న మద్దతును, రైతులపై బిజెపి శ్రేణులు చేస్తున్న దాడులను తక్కువ చేసి చూపిస్తున్నట్లుగానే అనేక విషయాల్లో ఇదే ధోరణి! జమ్మూ కాశ్మీర్‌ను ఏకపక్షంగా మూడు ముక్కలు చేసిన తరువాత అక్కడి ప్రజల గొంతులను ఎలా నొక్కేశారు? అక్కడేం జరుగుతోందో బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి ఇంటర్‌నెట్‌ను కూడా నెలల తరబడి నిలిపివేశారు కదా! చివరకు ప్రజాప్రతినిధులను, మాజీ ముఖ్యమంత్రులను గృహ నిర్బంధం చేసిన తీరు మానవహక్కులపై దాడి కాక మరేమిటి? ఆ చర్యతో ఏదో సాధించామని చెప్పుకున్న దానికి భిన్నంగా కాశ్మీర్‌ ఇంకా రగులుతూనే ఉండటానికి, సైనికులతో పాటు అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుండటానికి కారణం ఏమిటి? ఎందరో మేధావులు, రచయితలు, న్యాయవాదులను జైలు పాలు చేసినప్పటికీ భీమా కోరెగావ్‌ కేసు అడుగు కూడా ముందుకు ఎందుకు సాగడం లేదు? వయోవృద్ధుడని కూడా చూడకుండా స్టాన్‌ స్వామిని నానా అగచాట్ల పాల్జేసి, కస్టడీలోనే ప్రాణాలు పోయేలా చేశారే. దీనిని ఏమందాం? మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా మైనార్టీలను, దళితులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగిన మూకదాడుల సంగతేంటి? ఇంట్లోకి వచ్చి ఏం వండుతున్నారో తనిఖీలు చేసిన గుంపులకు ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను వ్యతిరేకించినందుకు ఎందరు దాడులకు గురయ్యారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతుందా!

నిజానికి ఈ తరహా చర్యల కారణంగానే దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా పాతాళానికి చేరుతోంది. 2020వ సంవత్సరానికి సంబంధించి స్వీడన్‌కు చెందిన ఒక సంస్థ రూపొందించిన ప్రజాస్వామిక నివేదికలో మోడీ హయాంలో మీడియా, పౌరసమాజం, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అణచివేతకు గురవుతున్నాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం కూడా దేశంలో రోజురోజుకి దిగజారుతున్న మానవహక్కుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చివరకు అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే 'ఫ్రీడమ్‌ హౌస్‌' సంస్థ కూడా మానవహక్కుల అమలులో మనం అధోగతి వైపు ప్రయాణం చేస్తున్నామని పేర్కొంది. తాజాగా కార్పొరేట్‌ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వ అండతో జరుగుతున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మానవహక్కులకు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు.