Nov 25,2020 06:39

నవంబర్‌ 26న దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఒక రోజు జాతీయ సమ్మె చేయబోతున్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అనేక రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన అశేష కార్మికులు...సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు తమ తీవ్ర అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేయబోతున్నారు. మేం ఏం చేసినా చెల్లుతుందనే ''అహం''తో వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలకు చేస్తున్న ఊడిగానికి కార్మికవర్గం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనే ఈ జాతీయ సమ్మె.


కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అయితే కరోనాలో తమ రాజకీయ ఎజెండా అమలు చేయడానికి మాత్రం బిజెపి ప్రభుత్వం ముందు పీఠిన ఉన్నది. చాలా కాలంగా భారతదేశం లోని పెట్టుబడిదారులు, గుత్త కుబేరులు కార్మిక చట్టాలను సవరించి 'హైర్‌ అండ్‌ ఫైర్‌' విధానాన్ని తేవాలని కోరుతున్నారు. ప్రస్తుత కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారని, కార్మిక సంఘాలు కూడా పరస్పరం పోటీ పడి కార్మికులను రెచ్చగొడుతున్నాయని, వాటి ఏర్పాటుపై ఆంక్షలు విధించాలని బిజెపి మంత్రులు చాలా కాలంగా ప్రకటనలు చేస్తున్నారు. కార్మికుల హక్కులను కుదించనిదే పెట్టుబడులు రావనే వక్ర సిద్ధాంతాన్ని పనిగట్టుకుని ప్రచారం చేస్తూ వచ్చారు. ఇంత కాలం కార్మిక చట్టాల మార్పును కార్మిక సంఘాలు వరస ఆందోళనలు, సమ్మెల ద్వారా అడ్డుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కరోనాను ఉపయోగించుకుని పార్లమెంట్‌లో చర్చకు కూడా అనుమతించకుండా 4 లేబర్‌ కోడ్‌లు ఆమోదింప చేసి మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేయడం ద్వారా కార్పొరేట్ల పట్ల తన విధేయతను చాటుకున్నది. ప్రస్తుతం కార్మికులు బ్రిటీష్‌ కాలం నుంచి పోరాడి సాధించుకున్న హక్కులు అనేకం కోల్పోయారు. ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ నామమాత్రమే అయ్యింది. కార్పొరేట్ల సేవలో మునిగిన మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేసింది. కోరలు లేని లేబర్‌ కోడ్‌ల ద్వారా సంపద సృష్టించే వర్గం శ్రమను దేశంలో కొల్లగొట్టేవారి చేతిలో బందీగా మారింది.
స్వాతంత్య్రం అనంతరం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను, జాతీయ బ్యాంకులను, భారతీయ రైల్వేలను, జీవిత బీమా సంస్థతో పాటుగా ఇతర ఆర్థిక సంస్థలను, బొగ్గు గనులతో సహా ఇతర ఖనిజ వనరులను, ఓడరేవులు, విమానాశ్రయాలు సర్వస్వాన్ని నూటికి నూరు శాతం ప్రైవేటీకరణకై మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భరత పేరుతో పథకాన్ని ప్రకటించి, కరోనా కాలంలో అమలు జరుపుతున్నది. స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను, ఇన్నాళ్ళు ప్రజల త్యాగాలతో నిర్మించుకున్న సంపదను కొల్లగొట్టడానికి మోడీ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. కరోనా కాలంలో ప్రజలకు ఆర్థికంగా ఏ సహాయం చేయని కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక రాయితీలను ఇవ్వడమేగాక దేశం లోని ప్రజల సంపదను కారుచౌకగా అప్పగించడానికి సిద్ధపడటాన్ని కార్మికవర్గం తీవ్రంగా ఖండిస్తోంది. ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన విద్యుత్‌ రంగాన్ని ప్రైవేట్‌ వారికి అప్పగించడం, రైల్వేల మౌలిక వసతులు అప్పజెప్పి ప్రైవేట్‌ రైళ్ళను అనుమతించడం ప్రజలపై తీవ్రమైన భారాలకు దారితీస్తుంది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం అంటే ఉపాధిలో రిజర్వేషన్లను సమాధి చేయడమే. ఈ ఆత్మ వినాశన విధానాలను ప్రతిఘటించడానికై, విచ్చలవిడి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ సమ్మె తప్ప వేరే మార్గం లేదని భావించిన కార్మిక సంఘాలు ఏకతాటిపై నిలిచి ముక్త కంఠంతో సమ్మె చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చాయి. మోడీ ప్రభుత్వం దేశానికి, ప్రజానీకానికి చేస్తున్న ద్రోహాన్ని నిలువరించడానికి దేశభక్తితో కార్మికవర్గం ఈ పిలుపునివ్వడం అనివార్యమైంది.


దేశంలోని సాధారణ ప్రజలందరికి సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు నిత్యావసర వస్తువులు అందించాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. ఇటీవల కరోనాను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను ఆమోదించడం ద్వారా మొత్తం వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ను కార్పొరేట్‌, పారిశ్రామిక వర్గాలకు అప్పగించడానికై మార్గం సుగమం చేసింది. రైతుల ఉత్పత్తులను ఎవరైనా, ఎక్కడైనా కొనవచ్చని, గోదాముల్లో ఎంత భారీగానైనా నిల్వ పెట్టుకోవచ్చని చెబుతూ రైతులకు మద్దతు ధర లభించడానికి తోడ్పడుతున్న మార్కెట్‌ యార్డులను రద్దు చేస్తున్నామని ఈ చట్టాల్లో చెప్పడం జరిగింది. దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతుల వద్ద నుండి కారుచౌకగా వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి గోదాముల్లో దాచుకోవడానికి టోకు వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కృత్రిమ కొరతను సృష్టించి వారి దగ్గర ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను అత్యధిక ధరలకు అమ్ముకోవడానికి మోడీ ప్రభుత్వం చేసిన చట్టాలు ధనిక వ్యాపార వర్గాలకు ఎంతో ఉపయోగపడతాయి. అదే సమయంలో ఈ చట్టాల వల్ల భారత ప్రజానీకం ఆహార భద్రతను కోల్పోతారు. రైతుల ఆత్మహత్యలు, పేదల ఆకలి చావులు పెరగడానికి మాత్రమే ఈ చట్టాలు ఉపయోగపడతాయి. వాటిని తక్షణం ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమ్మె జరగనున్నది.


దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు ఇప్పటికే కనీస వేతనాలు లేక, ఉద్యోగ భద్రత లేక అర్ధ బానిసలుగా జీవిస్తున్నారు. గతంలో కార్మిక మహాసభలో ఆమోదించిన సూత్రాలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలనే కోర్కెను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్కీమ్‌ వర్కర్లు, అంగన్‌వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, విఓఏ లు ఏ హక్కులు లేని జీవితాన్ని గడుపుతున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో ఇప్పటికే ఒక బానిస వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన కార్మికులతో పోల్చితే భారత కార్మిక వర్గం చాలా అధ్వాన్నమైన జీవితాన్ని గడుపుతున్నది. పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు రాయితీలు ప్రకటించే కేంద్ర ప్రభుత్వానికి... ఉద్యోగుల కరువు భత్యం భారమైందని, వచ్చే సంవత్సరం వరకు డిఏ లను స్థంబింప చేసింది. ధరలు ఎంత పెరిగినా కరువు భత్యం ఇవ్వమని చెప్పడం అమానుషం కాక మరేమిటి? కార్మిక వర్గం ప్రస్తుత కరోనా కాలంలో కోల్పోయిన హక్కుల సాధనకు, తమ సంస్థల పరిరక్షణకు, పేద ప్రజలందరికీ నగదు సహాయం చేయాలనే కోర్కెలతో పాటు రైతాంగానికి మద్దతుగా నవంబర్‌ 26 సమ్మెకై పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ప్రజానీకం కూడా కార్మికులకు మద్దతుగా కదలాల్సిన అవసరమున్నది. కార్మికవర్గం వీధి, వాడ నిరసన ప్రదర్శనలతో సమ్మెను విజయవంతం చేయడం ఎంతైనా అవసరం.
                                                     - ఎం.ఏ. గఫూర్‌ (సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)