Aug 29,2021 08:26

మొక్కలు పెంచడం ఓ అభిరుచి. ఇంట్లో కొద్దిపాటి జాగా ఉంటే చాలు. ఏదో ఒక మొక్కను పెంచుకోవాలన్న ఆసక్తి నేటి తరానిది. ప్రస్తుతం ఇళ్ల ఇంటీరియర్‌ డెకరేషన్లో మొక్కల కూర్పు ఓ భాగమైపోయింది. ఈ అధునాతన మొక్కలు ఇళ్లలో సజీవ కళారూపాలై విరాజిల్లుతున్నాయి. ఇవి సరికొత్త రూపాల్లో కాంతులీనుతుంటే ఆ మనోహర దృశ్యాలను కన్నుల్లో నింపుకోకుండా ఉండగలమా? అవేంటో తెలుసుకుందాం...
నేడు కుండీల్లో కళాత్మకంగా మొక్కలు పెంచే కల్చర్‌ నానాటికీ పెరుగుతోంది. కాదేదీ కళకనర్హమంటూ మొక్కలతో నట్టింట్లో విరుస్తున్న కొన్ని అపురూపాలు ఇవి.
వెరీ'గుడ్‌' డెకరేషన్‌:
చక్కగా రంగు రంగుల్లో విచ్చుకునే గడ్డి గులాబీ మొక్కలు ఎలా పెంచినా చక్కగా పెరుగుతాయి. నాచుగులాబీ పేరుతో పిలిచే వీటి శాస్త్రీయనామం పోర్టులాక గ్రాండిప్లోరా. మట్టి, కొబ్బరిపొట్టు మిశ్రమంలో వీటిని నాటితే పూలు భలే విచ్చుకుంటాయి. వీటిని కళాత్మకంగా ఎక్కడబడితే అక్కడ అలంకరించుకోవచ్చు. రెండు రోజులకు ఒకసారి స్పూన్‌తో కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది.
కేట్‌ కాక్టస్‌:
మార్కెట్లోకి వస్తున్న సరికొత్త రకాల కుండీల్లో పిల్లి బమ్మ కుండీ ఒకటి. కుండీ నిండా మట్టి వేసి, దాని వెనుక భాగంలో సన్నని కాక్టస్‌ (ఎడారిమొక్క) నాటితే అది చక్కగా తోకలా పెరుగుతుంది. కాక్టస్‌ మీద ఉండే నూగు అచ్చంగా పిల్లి తోక మీద వెంట్రుకల్లానే ఉంటాయి. చాలా రోజులు నీళ్లు పోయకపోయినా ఈ మొక్క చాలా నెమ్మదిగా పెరుగుతూనే ఉంటుంది. స్నేహితులకు బహుమతిగా ఈ మొక్కను ఇస్తూ ఉంటారు.మొ'క్కళ'... భళా!
ఫిష్‌ సకులెంట్‌:
మొక్క భాగాల్లో నీళ్లను దాచుకుని, విచ్చుకున్న పువ్వు ఆకారంలో ఉండే మొక్కలు సకులెంట్‌ మొక్కలు. చేపలు మాదిరిగా ఉండే కుండీల్లో వీటిని పెంచితే.. రెక్కలు మాదిరిగా అందంగా ఉంటాయి. వీటికి ఎక్కువరోజులు నీళ్లు పోయకపోయినా ఏమీకాదు. ఇంట్లో ఎక్కడైనా వీటిని అలంకరించుకోవచ్చు.
బట్టర్‌ఫ్లై బుష్‌:
చిన్న చిన్న ఆకులతో గులాబీలాంటి పువ్వులు పూసేది బట్టర్‌ఫ్లై బుష్‌. దీని శాస్త్రీయనామం పొలిగాలా మైత్రిపొలియా. ఇది నిత్యం పువ్వులు పూస్తుంది. దీన్ని మిక్కిమోస్‌ హెడ్‌ హాంగింగ్‌ పాట్‌లో పెడితే మరీ అందంగా ఉంటుంది. తెల్లటి కుండీల్లో పింకు పువ్వులు కొట్టచ్చినట్లు కనిపిస్తాయి.
తలలో కలాంచియాలు:
మనిషి తల ఆకారంలో ఉండే కుండీల్లో కలాంచియా మొక్కలు సరికొత్త అందాన్ని అద్దుకుంటున్నాయి. చిన్ని చిన్ని పువ్వులతో ఉండే ఈ మొక్కలు మానవ మెదళ్లు విచ్చుకున్నట్టుగా కళాత్మకంగా అబ్బురపరుస్తున్నాయి. ఇవి ఇండోర్‌ మొక్కలు కావడంతో ఇంటి లోపల ఎక్కడైనా అలంకరించుకోవచ్చు. మొ'క్కళ'... భళా!
ఒంటె కుండీల్లో సకులెంట్‌ మొక్కలు:
దళసరి ఆకులతో నిగనిగలాడే మొక్కలు సకులెంట్‌ మొక్కలు. వీటికి ఒక్కసారి నీళ్లు పోసినా చాలా రోజులు ఆకుల్లో దాచుకుని, ఉపయోగించుకుంటాయి. ఒంటె బమ్మవంటి కుండీల్లో ఈ మొక్కలు పెంచితే ప్రత్యేక ఆకృతుల్లో సరికొత్త కళతో ఆకర్షిస్తాయి. వీటిని బహిరంగ ప్రదేశాల్లోనూ, కాస్త ఎండా, నీడా తగిలే ప్రదేశాల్లోనూ పెంచుకోవచ్చు.
డైనోసారుల్లో స్నేక్‌ప్లాంట్స్‌:
సెన్సేవీర్యా శాస్త్రీయనామంతో పిలిచే స్నేక్‌ప్లాంట్స్‌ను ఇంటి లోపల పెంచుకోవచ్చు. వీటి ఆకులు దళసరిగా, గట్టిగా, సన్నగా, పొడవుగా పాములు మాదిరిగా ఉంటాయి. ఇవి రకరకాల రంగులు, డిజైన్లలో దొరుకుతాయి. వీటిని డైనోసార్‌ రూపంలో ఉండే కుండీల్లో పెంచితే చూడముచ్చటగా ఉంటాయి.
జాలువారే బైలీ తీగలు:
గోడలకు అలంకరించిన కుండీల నుంచి అందంగా జాలువారే నాజూకైన ఆకుల తీగ మొక్క బైలీ. లిటిల్‌ పికిల్‌ అని ముద్దుగా పిలిచే ఈ మొక్క శాస్త్రీయనామం ఒతోన్నకెపెన్సిస్‌. దీని ఆకులు, తీగలు లేత పింకు రంగులో ఉండి, ఎంతో ఆకట్టుకుంటాయి. ఇవి ఇంటికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
అలోవేరానూ అందంగా:
ఎన్నో రోగాలకు దివ్యౌషధం అలోవేరా. ఈ కలబంద మొక్కనూ కళాత్మకంగా పెంచుకోవచ్చు. మనిషి ఆకార కుండీల్లో ఇది ఎంతో అందంగా ఉంటుంది. శ్వేత శిల్పంలాంటి కుండీలో హరిత కాంతులు విరజిమ్ముతూ మొక్కల ప్రేమికుల మనస్సు ఇట్టే దోచేస్తుంది ఈ మొక్క.
- చిలుకూరి శ్రీనివాసరావు,
8985945506