Sep 15,2021 09:49

భువనేశ్వర్‌ : మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎఒబిలోని కొరాపుట్‌, మల్కాన్‌గిరి, విశాఖపట్నం జిల్లాల్లో దుబాసి శంకర్‌ అలియాస్‌ మహేందర్‌ అలియాస్‌ అరుణ్‌ అలియాస్‌ రమేష్‌ను ఒడిశాలో సోమవారం అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర డిజిపి అభరు తెలిపారు. ఆయన మంగళవారం భువనేశ్వర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్‌ ఆచూకీ చెప్పినవారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని గతంలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. కొరాపుట్‌ జిల్లా బయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పేటగడ అటవీ ప్రాంతంలో ఎస్‌వోజీ, జిల్లా వాలంటరీ దళం, బీఎస్‌ఎఫ్‌, రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌ చేసి.. నోయరో గ్రామంలో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. అతడివద్ద ఇన్సాస్‌ రైఫిల్‌, 10 రౌండ్ల బుల్లెట్లు, ఇతర సామగ్రి, రూ.35,000 నగదు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.

శంకర్‌ దుబాసి పై ఉన్న పలు కేసులు..
శంకర్‌ దుబాసి 1987 లో పార్టీలో చేరి.. 2003 నాటికి ఎస్‌జడ్‌సీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. అప్పటి నుంచి ఏవోబీలోనే పనిచేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కొరాపూట్‌ జిల్లాల్లో 20, తెలంగాణ రాష్ట్ర పరిధిలో 24 కేసులు శంకర్‌పై ఉన్నాయని డిజిపి తెలిపారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్‌ 1987 నుంచి తీవ్రవాద ఉద్యమంలో పాల్గంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతని భార్య భారతక్క 2016 లో మఅతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా శంకర్‌ ఉన్నారని డిజిపి తెలిపారు. ఈ ఏడాది విశాఖపట్నం జిల్లా తీగలమెట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడి హస్తం ఉందన్నారు. 2010 లో గోవిందపల్లిలో మందుపాతర పేలి 11 మంది ఒడిశా పోలీసులు, అనంతరం చిత్రకొండలోని జానిగుడలో జరిగిన కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మరణించారని, ఆ ఘటనలతో అతడికి సంబంధం ఉందని చెప్పారు.

శంకర్‌ను విడిచిపెట్టాలంటూ.. తెలుగురాష్ట్రాల పౌరహక్కుల సంఘం డిమాండ్‌
ఒడిశా పోలీసులు కొరాపూట్‌ జిల్లాలో రెండు రోజుల క్రితం మావోయిస్టు నేత దుబాసి శంకర్‌ ను అదుపులోకి తీసుకున్నారని అతడిని వెంటనే విడిచిపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్‌, తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్‌, ఎన్‌.నారాయణరావు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.