Nov 09,2020 08:24

         వేసవి సెలవులు ఆ రోజు నుండే ప్రారంభం. ఉదయం పదిగంటలు అవుతుండగా తొమ్మిదేళ్ల శశి ఇంట్లోంచి బయటికొచ్చాడు. పిట్టగోడ దగ్గర నిలబడి వీధిలోకి చూస్తున్నాడు. పిట్టగోడ పక్కనే పొగడ చెట్టు వుంది. గాలి వీచినప్పుడల్లా దాని నుండి మంచివాసన వస్తోంది. ఆ పరిమళం బావుందనుకున్నాడు శశి. బడి వున్న రోజుల్లో ఆ హడావుడిలో ఇలాంటివన్నీ గమనించే అవకాశం వాడికి ఉండదు. చెట్టు మీద ఒక గోరింకల జంట వింత శబ్ధాలు చేస్తోంది. వాటిని ఆసక్తిగా చూడ్డం మొదలెట్టాడు శశి. ఒక పిట్ట చెట్టు మీద నుంచి ఎగిరి, వీధి అటుపక్క వాలింది. దానికి దగ్గర్లో, ఆ రాత్రి కురిసిన వానకి నీళ్లు నిలిచి వున్నాయి రోడ్డు మీద. ఆ గోరింక వెళ్లి, ఆ నీటిలో ముక్కుని పెట్టి తాగబోయింది. ఇంతలో ఏదో బైక్‌ పెద్ద శబ్దం చేస్తూ మెయిన్‌ రోడ్‌ వైపు నుండి వీధిలోకి వచ్చింది. ఆ శబ్దానికి బెదిరి, గోరింక ఎగిరి అవతల ఇంటిగోడ మీద వాలింది. అది మళ్లీ దిగి, నీళ్లు తాగే ప్రయత్నం చెయ్యడం ఈలోగా ఏదో ఒక బండి రావడం జరుగుతోంది. పాపం...! దాని దాహం తీరే అవకాశం రాక, నిరాశగా పొగడ చెట్టు మీద మళ్లీ వాలింది. తర్వాత రెండుపిట్టలూ ఎటో ఎగిరిపోయాయి.
ఆ దృశ్యం శశి మనసును బాగా తాకింది. పిట్ట దాహం తీరనందుకు బాధ కలిగింది. వెంటనే ఇంట్లోకెళ్లి, వంట ఇంట్లో ఓ స్టీలు గిన్నెని తీసుకుని, ఫిల్టర్‌ దగ్గర నీళ్లని నిండుగా పట్టి, బయటికొచ్చి పిట్టగోడ మీద పెట్టాడు. దూరంగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి పిట్టల రాక కోసం ఎదురు చూడసాగాడు. ఎంతసేపు చూసినా ఒక్క పిట్టా రాలేదు.
          తరువాత రెండ్రోజులకు అక్కడ నీళ్లు వున్న సంగతి పిట్టలు గమనించాయి. పిచ్చుకలు, గోరింకలు ఏదో ఒక సమయంలో వచ్చి ఆ గిన్నెలో నీటిని తాగడం మొదలెట్టాయి. సాయంత్రం గిన్నెలో నీళ్లు అడుక్కి వెళ్లడం చూసిన శశి ఎంతో సంబరపడ్డాడు. రోజూ నీటిని నింపిన గిన్నె పెట్టడం శశి మానలేదు.
ఊరు నుంచి శశి తాతయ్య, నాన్నమ్మ వచ్చారు. వస్తూ వాళ్ల తోటలోని బంగినపల్లి మామిడిపళ్లు తెచ్చారు. ఆ మధ్యాహ్నం భోజనానికి శశి వాళ్ల నాన్నమ్మ, తాతయ్యతో కూర్చున్నాడు. తాతయ్య రామానుజం అన్నంలో పప్పు కలుపుకుని, మొదటి ముద్దని కళ్లకు అద్దుకుని కంచం పక్కన పెట్టాడు. శశి దాన్ని చూసి 'ఎందుకు తాతయ్య?' అని అడిగాడు. 'దేవుడి కోసం.... అయినా దేవుడు ఏమైనా తింటాడా? అది నోరులేని జీవరాశుల ఆకలి తీర్చుతుంది. దాన్ని దూరంగా ఏ గోడ మీదో పెడితే, ఏ చీమలో, పక్షులో తమ ఆకలి దానితో తీర్చుకుంటాయి' అని అన్నాడు ఆయన.
          పిట్టల కోసం తను గిన్నెలో నీళ్లు పెడుతున్న సంగతి చెప్పాడు శశి. దానికి ఎంతో సంతోషించిన తాతయ్య 'మంచిపని చేస్తున్నావురా' అంటూ మనవడ్ని మెచ్చుకున్నాడు. 'మీ వారసత్వాన్ని వీడు అంది పుచ్చుకున్నాడు' అంటూ శశిని చూసి మురిసిపోయింది నాన్నమ్మ.
శశికి తాతయ్య చెప్పింది బాగా నచ్చింది. ఆ తర్వాత తనూ భోజనం చేసేటప్పుడు తొలిముద్దను తీసి పక్కన పెట్టి, తర్వాత దాన్ని గోడమీద పెట్టేవాడు. అది శశికి అలవాటుగా మారింది. ఆ ముద్దని పిట్టలో, పురుగులో, చీమలో తినేవి.
దసరా సెలవులకి అమ్మానాన్నలతో కలిసి శశి మైసూర్‌ వెళ్లాడు. ఓ రోజు ఉదయం చాముండీ హిల్స్‌ కెళ్లి వస్తూ... ఓ కాలనీలో వున్న హోటల్‌కి టిఫిన్‌ చెయ్యడానికి వెళ్లారు. ఆ హోటల్‌ చిన్నదే అయినా చాలా పరిశుభ్రంగా ఉంది. శశివాళ్లు రాగి దోశల్ని ఆర్డర్‌ చేశారు. టిఫిన్‌ వచ్చేలోగా ఓ విదేశీ జంట, టూరిస్టులు కాబోలు వచ్చి కూర్చున్నారు వీళ్లకి దగ్గర్లో.
           ఆ జంట ముద్దుగా వున్న శశిని చూస్తూ.. పలకరింపుగా నవ్వారు. శశి గురించే వాళ్లలో వాళ్లు నెమ్మదిగా మాట్లాడుకోసాగారు. ఈలోగా టిఫిన్‌ వచ్చింది.
శశి అలవాటు ప్రకారం దోశెని కొంచెం తుంచి, ఆ ముక్కని టేబుల్‌ మీద పెట్టాడు. తర్వాత తినడం మొదలెట్టాడు. ఆ దృశ్యం ఆ జంట దృష్టిలో పడింది. శశి కావాలనే అలా చేశాడని వాళ్లకి అర్థమైంది. ఆ జంటలోని ఆమె చొరవగా తనపేరు మార్గరట్‌ అని చెప్పి, శశి వాళ్ల అమ్మని, వాడు దోశెముక్కని ఎందుకు పక్కన పెట్టాడో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది.
            శశి అమ్మ క్రాంతి వాడు అలా ఎందుకు చేసింది వివరంగా చెప్పింది ఇంగ్లీషులో. అంత చిన్న పిల్లవాడికి వున్న మంచి ఆలోచనకు అబ్బురపడ్డారు ఆ జంట. ''వెరీనైస్‌!'' అని మెచ్చుకున్నారు. టిఫిన్‌ తింటున్న శశిని, అతను పక్కనుంచిన దోశె ముక్కను తమ సెల్‌లో చిత్రీకరించారు. ఆ దృశ్యాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టడానికి శశి అనుమతి కావాలని ఆ జంట అడిగింది. వాళ్లు తన గురించి చిత్రీకరించడం. దాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టడానికి తననే అనుమతి కోరడం చూసి, కొంచెం గర్వంగా అనిపించింది శశికి. శశి సరేనన్నాడు. వాళ్లు వెంటనే ఆ దృశ్యాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. శశివాళ్ల నాన్నగారికి ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపించి, దాన్ని ఆయనకి షేర్‌ చేశారు. తర్వాత దానికి ఎన్నో లైకులు, షేర్లు వచ్చాయి. మెచ్చుకోలుగా ఎన్నో కామెంట్లూ వచ్చాయి. వాటిని చూసుకుని మురిసిపోవడం చూసిన శశితో వాళ్లనాన్న సూర్యం 'మనం చేసే మంచిపనులు ఒకళ్ల మెచ్చుకోళ్లని ఆశించి చేయకూడదు. మనం చేసే పనుల వల్ల ఇతరులకు, తోటి జీవులకు మేలు కలగడమే ముఖ్యం. ఎవరో పొగడ్తలపైనో మనకి దృష్టి ఉండకూడదు!' అని వివరించాడు. శశికి అది నిజమే అనిపించింది.

ఎస్‌. హనుమంతరావు
8897815656