Nov 22,2020 16:46

ఐదేళ్ల వయసులోనే చుట్టూ పిల్లల చేత ఎగతాళికి గురై, ఆ తరువాత అమ్మానాన్నల నిరాదరణకు గురై అనాథగా మారింది మనీషా. పెరిగి, పెద్దదై... ఇప్పుడు అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటోంది. ఎప్పటికైనా అనాథల కోసం ఓ ఆశ్రమాన్ని నిర్వహించాలనుకుంటోంది. మనీషాది ఛత్తీస్‌గఢ్‌లో పఖంజూర్‌.
           ఇంటి నుంచి బయటకు వచ్చిన మనీషాను కొన్ని రోజుల తరువాత ఒక ట్రాన్స్‌ మహిళ చేరదీసింది. తన పట్ల ఆ మహిళ చూపిన దయనే ఇప్పుడు తాను కూడా ఓ తల్లి స్థానంలో ఉండి పంచుతోంది. ఏడుగురు అమ్మాయిలను, ఒక అబ్బాయిని పెంచుతోంది మనీషా. బాల్యంలో తాను కోల్పోయిన ప్రేమానురాగాలను ఆ పిల్లలకు అందిస్తోంది. 'పట్టించుకోకపోవడం వల్ల కలిగే బాధను నేను అనుభవించాను. అందుకే నాకు ఎవరైనా అనాథ కనపడితే వారిని నావెంట ఇంటికి తీసుకెళ్తాను' అంటుంది. చిన్నతనంలోనే తానొక ప్రత్యేక వ్యక్తినని తెలుసుకున్న మనీషాను స్నేహితులు దగ్గరకు చేరనిచ్చేవారు కాదు. దీంతో తల్లిదండ్రులు తనను ఇంట్లోనే బంధించి ఉంచేవారు. తరువాత ఇంటి నుంచి వెళ్లగొట్టారు. 'వారి గౌరవ మర్యాదల కోసం నా తల్లిదండ్రులు నన్ను ఇంటి నుండి గెంటేశారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఎన్నో కష్టాలు పడ్డాను. చాలా రోజులు తిండి లేకుండా గడిపాను. అప్పుడే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను పెద్దయ్యాక అనాథ పిల్లలను అక్కున చేర్చుకోవాలని' అంటుంది మనీషా.
        పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకల్లో పాటలు పాడి, నాట్యం చేసి డబ్బులు సంపాదిస్తోంది. అలా వచ్చే కొద్దిమొత్తంతోనే పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది. 'ఇప్పుడు కరోనా వచ్చి ఆ డబ్బు కూడా రావడంలేదు. పిల్లలను ఆకలితో ఎన్ని రోజులని ఉంచగలను? మొదట కూడబెట్టుకున్న సొమ్ముతో కొన్ని రోజులు ఎలాగో గడిచాయి. ఇప్పుడు అవి కూడా లేవు. అందుకే ఎక్కడైనా కూలి పనైనా దొరుకుతుందేమోనని ఎదురుచూస్తున్నాను' అంటోంది. మనసున్న ట్రాన్సమ్మగా ఆమె చూపిస్తున్న మానవత్వం ఎందరినో కదలిస్తోంది.