Oct 17,2021 12:17

అది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉన్నత పాఠశాల. చుట్టు పక్కల ఆరేడు గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకోడానికి ఆ పాఠశాలకు వస్తుంటారు. వారి మధ్య చదువు పట్ల పోటీతత్వం ఎక్కువగా ఉండేది. చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ఈ పాఠశాల ఉన్న ఊరు పెద్ద పట్నంగానే ఉండేది. మందులకు, నిత్యావసర వస్తువులకు ఆ ఊరే అందుబాటులో ఉన్నందున చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాఠశాలకు వెళ్లే పిల్లలకు చిన్న చిన్న పనులు అప్పగిస్తుండేవారు.
   మందుల కోసం కొందరు, కూరగాయల కోసమని మరికొందరు విద్యార్థులు డబ్బులు తెచ్చుకుంటుండేవారు. రానురాను విద్యార్థుల డబ్బులు తరగతిగదిలో పోతున్నాయి. ఎవరు తీస్తున్నారో తెలియక, గగ్గోలు పెడుతున్నారు. ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేస్తే దొంగతనం తప్పని హితబోధ చేసేవారు. ఫలితం మాత్రం కనిపించేది కాదు. ఓ రోజు ప్రార్థన తర్వాత తరగతిగదికి వచ్చిన ఆరో తరగతి రాణి సంచిలో దాచుకున్న యాభై రూపాయల నోటు పోయింది. తండ్రి మందుల చీటీతో పాటు ఇచ్చిన డబ్బు అది. తనది పక్కూరు కాబట్టి సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మందులు కొనుక్కోవచ్చని పుస్తకం మధ్యలో దాచుకుంది రాణి. అవి ఇప్పుడు కనిపించడం లేదు. వెంటనే తరగతిగదిలోకి ప్రవేశించిన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది.
ఉపాధ్యాయుడు మొదట దొంగతనం తప్పని, నిజాయితీతో బతకడం గొప్పవాళ్ళ లక్షణం అని తెలియజేశాడు. తీసినవాళ్ళు నిజాయితీగా అందజేసి, గొప్పవాళ్ళగా బతకమని చివరగా సూచననూ చేశాడు. అయినా పిల్లల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆయనకు కోపం వచ్చింది. 'ఇప్పుడు చిన్నచిన్న దొంగతనాలకు అలవాటు పడ్డవాళ్ళు పెద్దయితే గజదొంగలుగా మారే ప్రమాదం ఉంది. గజదొంగల జీవితం జైల్లో గడపవలసి వస్తుంద'ని భయపెట్టి చూశాడు. అయినా విద్యార్థులలో చలనం రాలేదు. 'ఇంకా మీలో మార్పు రాలేదు. చివరిగా నా దగ్గరున్న మంత్రాల దుంపని ప్రయోగిస్తాను!' అంటూ కోపంతో హెచ్చరించాడు.
   'మంత్రాల దుంపా?' ఆశ్చర్యపోతూ అడిగారు విద్యార్థులు.'దొంగ భరతం పట్టే మంత్రాల దుంప. ఆ దుంపకు దొంగతనం విషయం చెప్పి మా నూతిలో వేసేస్తాను. దాని మహిమ వలన దొంగతనం చేసిన వాడికి ఒళ్ళంతా కురుపులు వస్తాయి. దొంగ సంగతి రేపు ఉదయానికి తెలిసిపోతుంది' అంటూ ఆందోళన కలిగేలా చెప్పాడు ఉపాధ్యాయుడు. 'మాష్టారూ! నా చేతికి కురుపులు ఇప్పటికే ఉన్నాయి. మీ మాట ప్రకారం ఇప్పుడు చెప్పకపోతే రేపు నన్నే దొంగగా గుర్తిస్తారేమో!' అనుమానంగా అడిగింది రాణి. 'నీ సంగతి తెలిసిందిగా రేపు మిగిలిన వాళ్ళని పరిశీలిస్తాను. దొంగను పట్టేస్తాను!' అంటూ తన మంత్రానికి తిరుగులేదన్నట్టు భయపెట్టాడు ఉపాధ్యాయుడు. రాణి బిగ్గరగా నవ్వింది. 'మంత్రాలకు చింతకాయలు రాలవన్న సంగతి సైన్సు చెబుతుంటే, మమ్మల్ని భయపెట్టడానికి మీ నోట అబద్ధం వచ్చిందన్న సంగతి మాకు తెలుసు సార్‌!' అంది. నిజమే నిజమే అంటూ మిగిలిన పిల్లలూ వంత పాడారు. పిల్లల ఆలోచనా సరళికి ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. ఈ తరం పిల్లల్ని మభ్యపెట్టడం కష్టమే అనుకున్నాడు. మిమ్మల్ని భయపెట్టి నిజాన్ని రాబట్టేందుకే అబద్ధమాడానని ఒప్పుకున్నాడు ఉపాధ్యాయుడు. 'పోయిన డబ్బులు తిరిగి దొరుకుతాయన్న నమ్మకం నాకు లేదు. రానున్న రోజుల్లో ఇటువంటి దొంగతనాలకు అడ్డుకట్ట వేయడానికి శాస్త్రీయతా ధర్మం గల వస్తువు ఒకటి మా ఇంటి దగ్గర ఉంది. రేపు తెచ్చి మీకు చూపిస్తాను!' అంది రాణి. పిల్లలంతా రాణి వైపు ఆశ్చర్యంగా చూశారు. ఉపాధ్యాయుడునూ ఆసక్తిగా రాణివైపు దృష్టి సారించాడు.
రాణి చిరునవ్వు నవ్వింది. 'నిన్న మా నాన్నగారు కొత్త సెల్‌ఫోను కొంటూ పాతది నాకు ఇచ్చారు. అందులో కెమేరా బాగా పనిచేస్తుంది. అది తరగతి గదిలో బ్లాకు బోర్డు మీద అమర్చి ఆన్‌ చేస్తే సి.సి కెమేరాలా పని చేస్తుంది. ఎవరు తప్పు చేసినా దొరికిపోతార'ని చెప్పింది. రాణి తెలివితేటలకు పిల్లలు జేజేలు పలికారు. ఉపాధ్యాయుడు అభినందించాడు. మర్నాడు రాణి తరగతిగదిలో విద్యార్థుల సహకారంతో సెల్‌ఫోను అమర్చింది. అప్పటి నుంచి దొంగతనాలు జరగడం లేదు.
 

బి.వి.పట్నాయక్‌
94413 49275