Nov 26,2021 07:40
  • తేమ శాతం మించితే కొనుగోలుకు నిరాకరణ
  • వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం
  • వెంటాడుతోన్న సంచుల కొరత
  • రోడ్లపైనే కుప్పలు పోసుకుని కునుకులేని అన్నదాతలు

ప్రజాశక్తి - ఏలూరు, కాకినాడ ప్రతినిధులు : ఆరుగాలం కష్టించి పండిస్తున్న పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉభయగోదావరి జిల్లాల్లో వేలాది మంది రైతులు నష్టపోయారు. ఎలాగోలా కోతలు కోసి తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈ తరుణంలో ధాన్యం అమ్మడానికి రైతులకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. తేమ శాతం, సంచులు, రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వంటి అనేక కారణాలతో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి.
     పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్‌లో 5.58 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఇప్పటికే 40 వేల ఎకరాల్లో రైతులు మాసూలు పూర్తిచేశారు. 874 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారుల లక్ష్యం 13 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా ఇప్పటివరకు 2,428 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. తేమ 17 శాతానికి మించితే ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఈసారి మిల్లర్లు నేరుగా ధాన్యం కొనుగోలు చేయకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో తడిపొడి ధాన్యం కొనుగోలు చేసేవారు కరువయ్యారు. మరోపక్క వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం అరబెట్టే పరిస్థితి లేదు. యంత్రాలతో మాసూలు చేసి ధాన్యం అరబెట్టి విక్రయించడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ముందస్తుగా సంచులు ఇవ్వాలని రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కోరినా ఇవ్వడంలేదు. తడిపొడి ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ డి.రాజును వివరణ కోరగా 17 శాతం మించి తేమ ఉంటే ధాన్యం కొనుగోలు సాధ్యం కాదని, సంచుల కొరతపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.
     తూర్పుగోదావరి జిల్లాలో 5.58 లక్షల ఎకరాల్లో రైతులు వరి చేశారు. ప్రస్తుతం 1.67 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. 1,018 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకోగా వర్షాలు, దిగుబడి తగ్గడంతో ఎంతైనా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పది రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు 166 మంది రైతుల నుంచి 36 ఆర్‌బికెల ద్వారా 935 టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. వర్షాల కారణంగా జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని అంచనా. రోజంతా ధాన్యాన్ని ఆరబెడుతున్నా తేమ శాతం పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. తేమ శాతంలో మరికొంత మినహాయింపు ఇవ్వాలని రైతులు ఎప్పటినుంచో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వర్షాల కారణంగా అనేకమంది రైతులు పొలాల్లోనే పంటను పనల మీద వదిలేశారు. దీంతో చాలాచోట్ల ధాన్యం మొలకలొచ్చింది. ధాన్యం కొనుగోలుకు సుమారు 47.25 కోట్ల సంచులు అవసరమని అధికారులు గుర్తించారు. అయితే సుమారు తొమ్మిది లక్షల సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సమాచారం.

                                                           నిబంధనలు సడలించాలి

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు

పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. ఇటీవల వచ్చిన వర్షానికి ధాన్యం తడిసింది. నాలుగు రోజులుగా ధాన్యాన్ని ఆరబెడుతున్నాను. తేమ శాతం నిబంధనతో ఇబ్బందులు ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు ఎవరూ రాలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
                                - కట్టా లోవరాజు, రైతు, సీతారామపురం, తాళ్లరేవు మండలం, తూ.గో జిల్లా