Jul 25,2021 13:54

అది ఎండాకాలం. ఒక చెరువుకు కొత్త వరదతోపాటు అనేక చేపలు వచ్చి చేరాయి. అదే చెరువులో తాబేలు నివాసముండేది. కొంగ, తాబేలు స్నేహితులు. కొంగను చూడగానే చేపలు భయపడ్డాయి.
అప్పుడు కొంగ 'మీరు ఏమీ భయపడకండి. చేపల ఆహారం తినడం ఎప్పుడో మానేశాను. మీకు నమ్మకం లేకపోతే నా మిత్రుడైన తాబేలును అడగండి' అని అంది.
ఆ మాటలు విని చేపలు తాబేలును అడిగాయి. 'అవును ఆ కొంగ చాలా మంచిది' అని జవాబు ఇచ్చింది. ఆ మాటలు విని చేపలు ఎంతో సంతోషించాయి. క్రమక్రమంగా చెరువులోని చేపలు తక్కువ కావడం ప్రారంభించాయి. ఒక తెలివిగల చిన్న చేప ఇది కనిపెట్టి మిగతా చేపలకు సంగతిని తెలిపింది.
అప్పుడు చేపలన్నీ కొంగలేని సమయం చూసి తాబేలును 'మిత్రమా! మమ్మల్ని కొంగ పట్టుకొని తినదు కదా' అని అనుమానం వ్యక్తం చేశాయి. అప్పుడు తాబేలు కోపించి 'మీకు అన్నీ అనుమానాలే. నా మిత్రుడు అలాంటివాడు కాదు. అలా అయితే నేనెందుకు స్నేహం చేస్తాను? మీరే చెప్పండి!' అని అంది.
ఒక కప్ప తన మడుగులో నీరు తక్కువ కావడం గమనించి, ఈ చేపల చెరువుకు ప్రయాణం సాగించింది. దారిలో ఒక బండరాయి వెనుక తాబేలు, కొంగ మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. తాబేలు కొంగతో 'మిత్రమా! నీవు ఇలా చేపలు అన్నింటినీ మాయం చేస్తే వాటికి అనుమానం వస్తుంది. నా మీద నమ్మకమూ పోతుంది. చివరకు నేను ఒక్కదాన్నే మిగిలిపోతాను. ఇంక నా వల్ల కాదు' అని అంది.
అప్పుడు కొంగ తాబేలుతో 'మిత్రమా! నీవు లేకుంటే నేను లేను. మన స్నేహానికి చిహ్నంగా నీవు రోజూ నాకు చేపలను నమ్మించి, ఆహారంగా అందిస్తున్నావు. ఇంకొక చెరువుకు వెళదామంటే అక్కడ నీరు లేదు. నీవు ఎలాగైనా వాటిని నమ్మించి నా దగ్గరకు పంపు' అని అంది.
అప్పుడు తాబేలు 'సరే మిత్రమా! నీ మాటలకు నేను ఎదురు చెప్పలేను. అది నా బలహీనత. నీవు రోజూ కాకుండా రెండు రోజులకు ఒకసారి ఒక చేపను మాయం చేస్తే బాగుంటుంది. అలాగైతే చేపలకు అనుమానం రాదు' అని సలహా ఇచ్చింది.
ఇదంతా చాటు నుండి విన్న కప్ప చెరువులో ప్రవేశించింది. 'మీరు కొంగనూ, తాబేలును నమ్మకండి. మీ చేపలను ఆ కొంగ రహస్యంగా ఒక బండరాయి వెనుకకు తీసుకొని వెళ్లడం కళ్లారా చూశాను. తాబేలు, కొంగ రహస్యంగా మాట్లాడుకోవడమూ విన్నా' అని అంది. అప్పుడు చేపలు తమ అనుమానమే నిజమైందనుకుని, 'మిత్రమా! మరి మమ్మల్ని వాటి బారి నుండి ఎలాగైనా కాపాడు' అని చేపలు కప్పను వేడుకున్నాయి. అప్పుడు కప్ప 'నేను అల్పజీవిని. మిమ్మల్ని ఆ పెద్ద ప్రాణుల నుండి ఎలా కాపాడగలను? మీరే ఏదైనా ఉపాయం ఆలోచించండి!' అని అంది.
అప్పుడు చేపలు 'మిత్రమా! నీవు చాలా తెలివైనదానివి. అందులోనూ అనుభవం ఉన్న దానివి. అందువలన నీవు తప్ప మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు. ఏదైనా ఉపాయం ఆలోచించి, మా ప్రాణాలు కాపాడు' అని అన్నాయి. అందుకు కప్ప సరేనంది.
ఒకసారి జాలర్లు వలలు పట్టుకొని ఆ చెరువుకు వచ్చారు. ఈ సంగతిని కప్ప ముందే గమనించింది. అప్పుడు కప్ప బెకబెకమని అరచి, ఆ చేపలను బండరాయి కింద దాక్కొమ్మని చెప్పింది. కప్ప తాను మరొక బండరాయి కింద దాక్కుని తప్పించుకుంది. తనకు ఏమీ కాదనే ధీమాతో ఉన్న తాబేలు ఆ వలలో పడింది. కొంగ భయంతో అక్కడి నుండి ఎగిరిపోయింది. జాలర్లు తాబేలును తమ బావుల్లో ఉన్న పురుగుల్ని తినటానికి పనికి వస్తుందని పట్టుకొని వెళ్లారు. దానితో చేపలకు తాబేలు, కొంగ పీడ విరగడైంది. అవి కప్పకు కృతజ్ఞతలు తెలిపాయి. అందుకే మోసకారుల మాటలు నమ్మకూడదు.
 

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
9908554535