Oct 25,2021 06:57

యుద్ధం మీద
ఎన్ని కవితలు రాసినా
యుద్ధం ఆగడం లేదు
ఆవుల కోసం అన్నారు
సంపద కోసం అన్నారు
ఆడవాళ్ళ కోసం అన్నారు
రాజ్య విస్తరణ అన్నారు

ముందు నుంచి చంపారు
యుద్ధ నీతి కాస్త దారి తప్పి
ఎలా అయినా చంపడమే యుద్ధం అని కుటిల నీతి రాశారు

భూమధ్య రేఖ చెరిగిపోయింది
సముద్రం లొంగిపోయింది
సూర్యుడు సంధి చేసుకున్నాడు
నెలవంక తలవాల్చింది

అన్ని ద్వారాలు తెరుచుకుని
యుద్ధం వ్యాపారం అయ్యింది
ఆయుధాలు
హృదయాల్లోనే మొలుస్తారు!
ప్రపంచమొక యుద్ధ మైదానం
సైనికుల జాబితాలో
అందరి పేర్లు
అనివార్యంగా రాసిఉంటాయి

యుద్ధంతో కూలిన నాగరికతలన్నీ
నేలంతా రోదిస్తున్నా
యుద్ధాన్ని ప్రేమించడం
మనిషితనం కాదు

లోలోపల పూలను స్వప్నించు
నీటి మేఘమై వర్షాన్ని కురిపించు
నెత్తుటి మడుగులు కాదు
రాజ్యం మెదడులో
యుద్ధాన్ని చెరిపేరు!
దయ మొలకెత్తని మనిషొక నిర్జీవి

మళ్ళీ యుద్ధం మీదే రాశాను
ప్రపంచంతో ప్రేమలో పడు
యుద్ధం మాయమౌతుంది!
- డాక్టర్‌ సుంకర గోపాలయ్య
94926 38547