Oct 13,2021 09:22

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : కర్నూలు ఉల్లి మార్కెట్‌లో మళ్లీ లొల్లి మొదలైంది. రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇ-నామ్‌ విధానంలో అయితే సరైన ధర లభించదని పలువురి రైతులను ఊసిగొల్పుతున్నారు. ధర ఏక్కడ లభించదేమోనని రైతులు వ్యాపారుల మాయలో పడి మోసపోతున్నారు. ఏ విధానంలోనైనా తమ పంటను కొనుగోలు చేయడమే తమకు ముఖ్యమని రైతులు భావిస్తున్నారు.
    దాదాపు 25 రోజుల విరామం తరువాత సోమవారం నుంచి ఇ-నామ్‌ విధానంలో ఉల్లి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించారు. అయితే రెండో రోజే వ్యాపారుల డ్రామాతో మధ్యాహ్నం వరకూ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. బహిరంగ వేలం ద్వారా సోమవారం కొంత ఉల్లిని వ్యాపారులు కొన్నారు. ఈ విషయంపై మార్కెట్‌ అధికారులు సమావేశం నిర్వహించి ఇ-నామ్‌లోనే కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. అందుకు వ్యాపారులు ఒప్పుకున్నారు. ఇ-నామ్‌ ద్వారా రైతులకు సరైన ధర లభించదని ఇతరులతో ప్రచారం చేయిస్తూ రైతులను రెచ్చగొట్టారు. దీంతో కొందరు రైతులు ఇ-నామ్‌ విధానంలో కాకుండా బహిరంగ వేలం ద్వారానే కొనుగోలు చేయాలని పట్టుబట్టారు. ఆ విషయాన్ని మార్కెట్‌ కార్యదర్శినే అడగాలని వారు బహిరంగ వేలానికి అనుమతి ఇస్తేనే తాము కొంటామని వ్యాపారులు తేల్చి చెప్పారు. దీంతో ఉదయం నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయి. రైతులు మార్కెట్‌ కార్యదర్శి కార్యాలయం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇ-నామ్‌ విధానంలో వ్యాపారులు కొంటారని, రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేదని అధికారులు నచ్చజెప్పారు. అయినా కొందరు రైతులు మాత్రం బహిరంగ వేలం ద్వారానే కొనాలని పట్టుబట్టారు. ఇలా అందరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొనుగోళ్లు సాగలేదు. ఈ వ్యవహారం గురించి మార్కెట్‌ అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు మార్కెట్‌కు సెలవు ఉండటం, దాదాపు 2,830 క్వింటాళ్ల ఉల్లిని రైతులు మంగళవారం మార్కెట్‌కు తీసుకురావడంతో రైతులు నష్టపోకుండా మంగళవారం ఒక్క పూట బహిరంగ వేలం ద్వారా క్రయవిక్రయాలు సాగించాలని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు అందడంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉల్లి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొత్తంగా 2,781 క్విటాళ్ల ఉల్లి కొనుగోళ్లు జరిగాయి. కనిష్టంగా రూ.600, గరిష్టంగా రూ.3,8100 మధ్యస్తంగా రూ.2700 పలికాయి. ఏ విధానంలో కొన్నా తమ పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తే తమకు లాభం ఉంటుందని రైతులు తెలిపారు. కాగా ఇ-నామ్‌ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని కర్నూలు మార్కెట్‌ యార్డ్‌ కార్యదర్శి ఆర్‌.జయలక్ష్మి, తెలిపారు.
 

                                                       ఇ-నామ్‌పై అవగాహనే లేదు

    రైతులకు ఎవరికీ ఇ-నామ్‌ మీద అవగాహన లేదు. ఎలా కొనుగోళ్లు జరిపి తే ఎక్కువ ధర వస్తుందో తెలీదు. నేను ఎకరాలో ఉల్లి పంట వేస్తే 50 బస్తాల దిగుబడి వచ్చింది. ఎలా కొన్నా మా పంటను కొనడమే మాకు ముఖ్యం. సోమ వారం కొనుగోళ్లు జరిగాయని మార్కెట్‌కు ఉల్లిని తీసుకువచ్చాం. మార్కెట్‌లో కొనకపోతే బయట వ్యాపారులు ఇచ్చినకాడికి అమ్ముకోవాల్సిందే లేదంటే పారబోయాల్సి వస్తుంది. - షాషావలీ, మరందొడ్డి, సి.బెళగల్‌ మండలం.