Nov 27,2020 20:19

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. రెండు రోజులపాటు విరామం తర్వాత దేశీయ చమురు కంపెనీలు శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 45 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.81.89, డీజిల్‌ రూ.71.86కు చేరాయి. నవంబర్‌ 20 నుంచి వరుసగా ఐదు రోజులపాటు చమురు ధరలు పెరిగాయి. గత రెండు రోజుల్లో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయ కంపెనీలు మళ్లీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మెట్రో నగరాలైన ముంబైలో పెట్రోల్‌ ధర రూ.88.58, డీజిల్‌ రూ.78.38, చెన్నైలో పెట్రోల్‌ రూ.84.91, డీజిల్‌ 77.30, కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.83.44, డీజిల్‌ రూ.75.43గా ఉన్నది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 31 పైసల పెంపుతో రూ.85.17, డీజిల్‌పై 48 పైసల పెంపుతో రూ.78.41కు పెరిగాయి. విజయవాడలో పెట్రోల్‌పై 30 పైసల పెంపుతో రూ.87.61, డీజిల్‌పై 47 పైసల పెంపుతో రూ.80.44కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 0.36 శాతం పెరిగి 47.91 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 1.44 శాతం తగ్గి, 45.05 డాలర్లకు పడిపోయింది.