Apr 14,2021 23:18

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో: మళ్లీ ఏడాది క్రితం పరిస్థితులు తలెత్తాయి. ఇంటి నుంచి బయటకు రావాలన్నా.. మార్కెట్‌కు పోవాలన్నా.. ఆఫీసుకు వెళ్లాలన్నా.. ఇప్పుడు ఎక్కడికైనా భయంతోనే వెళ్లాల్సి వస్తోంది. ఇంటికి వచ్చేలోపు ఎక్కడ కరోనా అంటుకుంటుందోనన్న బెంగ కూడా అందరిలో పెరుగుతోంది. కారణం కరోనా విస్పోటనం మాదిరిగా తయారైంది. తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ఎన్నికలు, కార్యక్రమాల కోసం ఇప్పటివరకూ కేసుల సంఖ్యను తగ్గించి ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు అన్ని కేసులనూ వెల్లడిస్తోంది.
మొన్నటి వరకూ అంటే పరిషత్‌ పోలింగ్‌ వరకూ 50లోపే ఉన్న కేసులు ఈ నాలుగు రోజుల నుంచీ వంద, రెండొందలు దాటాయి. రోజుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో కేసులను కూడా పరిగణలోకి తీసుకుంటే 500కు పైనే వస్తున్నట్లు సమాచారం. పైగా గతంలో మాదిరిగా పరీక్షలు చేయడం లేదు. ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. రిమ్స్‌ ఆసుపత్రి పాజిటివ్‌ కేసులతో నిండిపోయింది. సిఫార్సులుంటేనే వైద్యం గానీ, రూములు గానీ దక్కడం లేదు. పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇక కరోనా పెరుగుదల అందరిలోనూ కలకలం రేపుతోంది. మళ్లీ భయం..భయంతో తిరుగుతున్నారు. అన్ని రంగాలపైనా దీని ప్రభావం మళ్లీ మొదలవుతోంది. ప్రభుత్వం భారీగా కేసులు పెరుగుతున్నా ఆంక్షలు పెట్టలేదు. ఆంక్షలు పెట్టి జనాన్ని ఇళ్ల వద్దనే ఉంచితే కేసులు తగ్గుతాయనడంతో సందేహం లేదు. జనాన్ని ఇళ్ల వద్ద ఉంచితే ప్రభుత్వం పోషించాలి. మళ్లీ రూ.కోట్లు కేటాయించాలి. ఉచితంగా అధికస్థాయిలో రేషన్‌ ఇవ్వాలి. ఇవన్నీ మోయలేని భారాలుగా మారాయనే ఆలోచనతోనే ఇప్పుడు ప్రభుత్వం వదిలేసింది. దీంతో జనం ఎప్పటిలాగే తిరుగుతున్నారు. కొందరు కార్యక్రమాలను భారీగానే చేస్తున్నారు. పెళ్ళిళ్లు, ఆర్భాటాల విషయంలో తగ్గటం లేదు. ఏసీ హాళ్లలో జరిగే కార్యక్రమాలూ భారీగానే జరుగుతున్నారు. వేటిపైనా ఆంక్షలు లేవు. ఇవన్నీ ఇప్పుడు కరోనా వ్యాప్తికి కారకాలుగా మారాయి. ఒక వైపు కేసులు పెరిగి.. పరిస్థితి అదుపుతప్పే పరిస్థితి వస్తోంది. రానున్న కాలంలో కరోనా మరింత వేగంగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. కొన్ని కార్యక్రమాలపైనైనా ఆంక్షలు పెట్టకపోతే కరోనా కట్టడి కాదనే విషయాన్ని యంత్రాంగం గుర్తించాలి. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు పెరుగుతున్నాయి. కరోనా బాధితులకు రిమ్స్‌లో ఖాళీ లేదు. మధ్యతరగతి వర్గాలు ప్రైవేటు ఆసుపత్రులకే వెళుతున్నాయి. అందుకే ఇప్పుడు పట్టణంలోని పలు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు జనరల్‌ వైద్యం నుంచి కరోనా వైద్యం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కేసులు పెరిగినా పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఆంక్షలు పెట్టడానికి మాత్రం ఇష్టంగా లేదు. ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదనే భావనే ఇప్పుడు కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇళ్లకు చేరారు. ఉపాధిపైనా కరోనా ప్రభావం కనిపిస్తోంది. నిర్మాణరంగంపైనా ప్రభావం కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఇళ్ల పనులు చేయించుకునేవాళ్లూ వాయిదా వేసుకుంటున్నారు. చిరు వ్యాపారులు వణికిపోతున్నారు. ప్రయాణాల్లోనూ ఆందోళన తప్పడం లేదు. చాలా వరకూ రాకపోకలను తగ్గించుకుంటున్నారు. ప్రభుత్వ నియంత్రించే చర్యలు చేపట్టకుండా టీకాల పేరుతో కాలం వెళ్ల బుచ్చుతోంది. కఠిన చర్యలు చేపడితేనే వైరస్‌ను అదుపులోకి తేవడానికి వీలుంటుంది.