
లండన్ : మనుషుల నుండి మింక్ (అమెరికన్ మింక్గా పిలుచుకునే ఒక పెంపుడు జంతువు) లకు, అలాగే మింక్‌ల నుండి మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు తేల్చారు. నెదర్లాండ్స్‌లో 16 మింక్ ఫార్మ్స్లపై చేపట్టిన అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వైరస్ మానవుల నుండి మింక్స్కు సోకిందని, నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు బాస్ బి. ఒడె మున్నింక్తో సహా పలువురు తెలిపారు. ఇవి కరోనాను వ్యాప్తి చెందించే వాహకాలుగా మారే ప్రమాదం ఉందో లేదో తెలుసుకునేందుకు మింక్స్తో పాటు మస్టాలిస్ జాతులపై కూడా పరిశోధన చేయాల్సి వుంటుందని సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. నెదర్లాండ్స్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదట ఈ వైరస్‌ను రెండు మింక్‌లలో గుర్తించామని పరిశోధకులు తెలిపారు. అనంతరం దీనిపై లోతుగా అధయనం చేసేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టినట్లు వెల్లడించారు. వ్యాధి సోకిన 16 మింక్ ఫార్మ్‌లపై పరిశోధన చేపట్టేందుకు వాటిని పెంచే ఫార్మ్ యజమానులు, కార్మికులతో చర్చించారు. జూన్ చివరి నాటికి 97 మంది ఫార్మ్ యజమానులు, కార్మికులలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
అధ్యయనం ప్రకారం.. మింక్లో కరోనావైరస్ జన్యువులో వైవిధ్యత కనిపించిందని అన్నారు. ఈ సంక్రమణ సమూహాల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన కరోనా కేసులతో పాటు డి614జి మ్యుటేషన్ (కరోనా జన్యు మార్పిడి.. వ్యాధి తీవ్రత అధికం)కు దారితీస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే మింక్ ఫార్మ్స్‌కు సమీపంలో నివసించే ప్రజలపై కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెల్లడి కాలేదని, ఇవి భవిష్యత్తులో కరోనావైరస్ వాహకాలుగా మారకూడదని అన్నారు. దీంతో వీటి రోమముల ద్వారా వ్యపారం నిర్వహించే వారికి ఇవి ప్రమాదకరం కాకూడదని అధ్యయనంలో పేర్కొన్నారు.