Feb 21,2021 13:07

తోడేళ్ళూ పులులిప్పుడు
కట్లు దెంచుకుంటున్నరు
పచ్చదనాల్లో గెంతే జింకలనూ
ఇళ్ళల్లో రక్షిత మేకలనూ
లాగి మరీ వెంటాడగ వేటాడగ
దట్టమైన చట్టాల దుప్పట్లో దూరి
వేటేయ కాజేయ జూస్తున్నవి
భూములైనా బ్యాంకులైనా
ఫ్యాక్టరీలైనా చమురు బావులైనా
గనులైనా కడకు అడవులైనా
విందుకు బిరియానీలే
పసందైన పిజ్జాలూ బర్గర్లే

ధర పలకాలేగానీ మంచినీళ్ళైనా
బీరూ బ్రాందీలంత ప్రియాలే
పెంటైనా రూపాయి అవుతుందంటే
విస్తట్లో వడ్డించుకోవడానికి
వెనుకాడని జీవులు వాళ్ళు

జన ప్రపంచం నెత్తిన
ధన ప్రపంచ ప్రవచనాలే
'కార్పొ' నిధులకు సంతల్లో గేదల్లా
అమ్ముడైన ప్రభు మందిరాల్లో
దివిటీలు పట్టి చీకట్లు చీల్చి
ఏ మూల ఏ ధన జీవాలున్నాయో
చూసి, చూపిస్తున్న కళ్ళతో
తోడేళ్ళూ పులులిప్పుడు
కట్లు దెంచుకుంటున్నరు

మనిషిప్పుడు డబ్బు మందిరాల్లో
బందీ అయి స్వేచ్ఛగానే
బతుకుతున్నా ననుకుంటున్నాడు
అవునంటారో కాదంటారో మీ ఇష్టం

                                * ఉన్నం వెంకటేశ్వర్లు, 8332807330