
మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టండి
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మహిళా సంఘాల వినతి
ప్రజాశక్తి-తిరుపతిటౌన్: మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), పిఒడబ్ల్యూ మహిళా సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వినపతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి పి.సాయిలక్ష్మి, పిఒడబ్ల్యూ నాయకులు గంగ మాట్లాడుతూ కరోనా కారణంగా మహిళలు అధికంగా ఉపాధి కోల్పడం వలన ఇంట్లో పురుషుల దగ్గర తీవ్ర హింసను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కాలంలో మహిళలపై హింస పెరిగిందని అన్నారు. మద్యపాన అమ్మకాలు నియంత్రించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. అలాగే పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలని, దిశ చట్టాన్ని పటిష్టం గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి జయంతి, పిఒడబ్ల్యూ నగర కార్యదర్శి జయలక్ష్మి నాయకులు ఆండాళ్, ఉష, రేఖ, స్వాతి చందన, పూజిత, లలితమ్మ, లక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, నాయకులు వివేక్ తదితరులు పాల్గొన్నారు.