Nov 26,2020 00:49

జివిఎంసి గాంధీ పార్కులో నిరసన తెలుపుతున్న ఐద్వా నాయకులు

కలెక్టరేట్‌ : అంతర్జాతీయ మహిళ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ, దేశంలో మోడీ పాలనలో మహిళల పట్ల రోజురోజుకూ హింస పెరిగిపోతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో మహిళలపై హింస పెరుగుతోందని చెప్పేవారని, నేడు విశాఖ నగర నడిబొడ్డున కూడా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటుచేయాలని, నిర్భయ నిధులను విడుదలచేయాలని, మద్యనిషేధం అమలు చేయాలని, మహిళల పట్ల జరుగుతున్న హింసను అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షులు డి.సత్యవతి, మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ పాల్గొన్నారు.
నర్సీపట్నం : మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆర్డీవో కార్యాలయం వద్ద నర్సీపట్నం ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఏవి సూర్యప్రభ, సామ్రాజ్యం, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు
అరకులోయ : మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ శ్యామ్‌ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా సంయుక్త కార్యదర్శి వివి.జయ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగాయని, బాలికలు, ఒంటరి మహిళల బిడ్డల లక్ష్యంగా కామాందులు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు గణనీయంగా పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అవుతున్నాయని విమర్శించారు. మహిళల చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, నిర్భయ ఫండ్‌ తక్షణమే ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఐద్వా మండల నాయకులు భాను, శ్రీదేవి, శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.