Nov 30,2020 21:17

ప్రిన్సిపల్‌ను విచారిస్తున్న ఆర్‌జెడి

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలోని ఎన్‌ ఎస్‌ పి ఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా అధ్యాపకులకు విద్యార్థులకు ప్రిన్సిపల్‌ వల్ల రక్షణ కరువైందని కడప ఆర్‌ జె డి కళావతి అన్నారు. ప్రిన్సిపల్‌ అవలంభిస్తున్న వైఖరిపై అన్ని ఆధారాలతో కమిషన్‌కు నివేదిస్తామని వెల్లడించింది. గత వారం రోజులుగా మహిళా కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ప్రిన్సిపల్‌ సింహాద్రి వైఖరిపై ఆర్‌ జె డి కళావతి సోమవారం కళాశాలలో అధ్యాపకులను, కళాశాల సిబ్బంది, విద్యార్థినులను విచారించారు. ఈసందర్భంగా వారు తమ సమస్యలను ఆమెకు వివరించారు. అనంతరం ఆర్‌జెడి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కళాశాలలో అందరిని సమగ్రంగా విచారణ చేశామని చెప్పారు. ఈ విచారణ బట్టి చూస్తుంటే కళాశాలలో మహిళలకు రక్షణ లేదని తెలుస్తోందన్నారు. ఇచ్చిన ఫిర్యాదులను బట్టి విచారణ చేస్తే ప్రతి ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్నారు. అన్ని ఆధారాలతో నివేదికలు మహిళా కమిషన్‌ కు అందజేస్తామన్నారు. దీంతోపాటు ప్రిన్సిపల్‌ను వెంటనే బదిలీ చేసి, మహిళ ప్రిన్సిపల్‌ను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌కు సిఫార్సు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
విద్యార్థి సంఘాల ఫిర్యాదు : పట్టణంలోని ఎన్‌ఎస్‌పిఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ సింహాద్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ దక్షిణ ప్రాంత జిల్లా సహాయ కార్యదర్శి బాబావలి, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమాయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు ఆర్‌జెడి కళావతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్‌, సనావుల్లా, తరుణ్‌, పవన్‌, విద్యార్థినులు పాల్గొన్నారు.