
కొత్తవలస : మహిళా చట్టాలపై ప్రజలు, యువత సరైన అవగాహన కలిగి ఉండాలని సిఐ జి.గోవిందరావు తెలిపారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా కంటకాపల్లి, కాటకాపల్లి గ్రామ సచివాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శి కె.వెంకటరావు అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐ గోవిందరావు, ఎంపిడిఒ కె.శేషుబాబు మాట్లాడుతూ మహిళలను అందరూ గౌరవించాలని తెలిపారు. యువత మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసై చెడు మార్గాల్లో నడిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ మోసాలకు బలికావద్దని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోదల సురేష్ కుమార్, పిఎసిఎస్ డైరెక్టర్ మదిన అప్పలరాం, అయ్యరక పాత్రులు, కార్పొరేషన్ డైరెక్టర్ పిఎస్ఎన్ పాత్రుడు, విఆర్ఒ కాకర మల్లేశ్వరరావు, మహిళా పోలీసు శ్రీదేవి పాల్గొన్నారు.