Feb 02,2021 21:09

న్యూఢిల్లీ : 2021 - 22 కేంద్ర బడ్జెట్‌ మహిళలకు వ్యతిరేకంగా ఉందని ఐద్వా ఒక ప్రకటనలో విమర్శించింది. మహిళల భద్రత, సాధికారతకు చెందిన పథకాలన్నింటినీ కలిపి ' మిషన్‌ శక్తి' పేరుతో ఈసారి బడ్జెట్‌లో రూ.3,019 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇవి ఆయా పథకాలన్నింటిపై 2020 - 21లో చేసిన వ్యయాల కంటే 13 శాతం తక్కువని తెలిపింది. బ్రలహీన వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పనలో విస్మరించిందని పేర్కొంది. కరోనా ప్రభావం నేపథ్యంలో దేశ జనాభాలో అధిక శాతం నిరుద్యోగం, ఆదాయం కోల్పోవడంతో పాటు ఆహార అభద్రత సమస్యలను ఎదుర్కొంటున్నారని, వీటికి బడ్జెట్‌లో పరిష్కారం చూపలేదని విమర్శించింది. కార్మిక కోడ్‌లు, రైతు వ్యతిరేక చట్టాలతో మహిళలు, వారి కుటుంబాలు కార్పొరేట్‌ శక్తుల దయపై ఆధారపడాల్సి వస్తుందని పేర్కొంది. మొత్తంగా చూస్తే జెండర్‌ బడ్జెట్‌ కూడా తీవ్రమైన తగ్గింపులను చవిచూస్తోందని, 2020 - 21 సవరించిన అంచనాల ప్రకారం 2.07 కోట్లు(జిడిపిలో 1.06 శాతం) ఉంటే ఇప్పుడు అది 1.53 లక్షల కోట్లు(జిడిపిలో 0.4 శాతం)కు తగ్గించారని ఐద్వా తెలిపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖకు చేసిన రూ.3,310 కోట్ల ప్రభుత్వ ఆస్తులు, ప్రధాన సేవలను ప్రయివేటుపరం చేయడం ద్వారా జీవన వ్యయాలు పెరగడంతోపాటు మహిళలపై అదనపు భారం పడుతుందని ఐద్వా పేర్కొంది. ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను నిరసించాలని ఐద్వా తన శాఖలతో పాటు ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చింది.