Apr 08,2021 12:16

న్యూఢిల్లీ : మహరాష్ట్రలో వ్యాక్సిన్ల రగడ నిప్పు రాజుకుంటోంది. వ్యాక్సిన్ల కొరత ఉందని, మరో మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అయిపోనుందని గురువారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే వ్యాఖ్యానించారు. మరిన్ని టీకాల కోసం కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు మూడు రోజులకే వస్తాయని, మరిన్ని వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్నాయని, ముంబయిలో మూడు రోజులకు సరిపడా వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయని తోపే అన్నారు. ఇక్కడి పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు బుధవారం వీడియో కాల్‌ ద్వారా తెలిపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 14 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని..అంటే మూడు రోజులకు సరిపోతాయని అన్నారు. ప్రతి రోజూ 5 లక్షల డోసులను వినియోగిస్తున్నామని, అంటే వారానికి 40 లక్షల డోసుల వ్యాక్సిన్లు అవసరమౌతాయని పేర్కొన్నారు.
టీకా కేంద్రాల్లో కావాల్సినన్నీ మోతాదులు లేవని, దీంతో అవి మూసివేయవలసి వచ్చిందని, మోతాదు లేకపోవడం వల్ల కేంద్రాలకు వచ్చిన వారిని తిరిగి పంపిస్తున్నామని, త్వరగా టీకా సరఫరా చేయాలని హర్షవర్ధన్‌ను కోరినట్లు తెలిపారు. కాగా, వ్యాక్సిన్లు కొన్ని గంటల్లో అయిపోతున్నాయంటూ కేంద్ర హోం శాఖ మంత్రికి శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేదీ లేఖ రాశారు.
కాగా, మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత ఉందంటూ రాజేష్‌ తోపే చేస్తున్న ఆరోపణలపై బుధవారం హర్షవర్థన్‌ స్పందించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పింపుచ్చుకునేందుకు కొన్ని రాష్ట్రాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వైఫల్యాల నుండి దృష్టిని మరల్చేందుకు, ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనాను నివారించేందుకు మహారాష్ట్ర సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా కరోనాపై చేస్తున్న పోరుకు ఈ వ్యాఖ్యలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయని అన్నారు. ఇవన్నీ బాధ్యతారాహిత్యమైన ప్రకటనలుగా అభివర్ణించారు.