
ముంబయి : మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. దేశంలో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్న వేళ మహారాష్ట్రలో పక్షులు మృతి చెందుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూతో పక్షులు మరణిస్తుండగా.. శనివారం మరో 983 పక్షులు మృత్యువాతపడ్డాయి. లాతూర్‌లో అత్యధికంగా 253, యవత్మల్లో 205, అహ్మద్ నగర్లో 151, వార్ధాలో 109, నాగ్‌పూర్‌లో 45, గోందియాలో 23 ఫౌల్ట్రీ పక్షులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటి నమూనాలను పుణె, భోపాల్‌లోని డిఐఎస్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపినట్లు చెప్పారు. జనవరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5,151 పక్షులు మృతి చెందాయని పేర్కొన్నారు. ముంబయి, ఘోడ్‌బందర్, దపోలిలో కాకులు, హెరాన్స్ బర్డ్, మురాంబాలో ఫౌల్ట్రీ పక్షల నమూనాలను సేకరించగా ఏవియన్ఫ్లూ బారినపడ్డట్లు గుర్తించారు. బీడ్ జిల్లాలో కాకుల నుంచి నమూనాలను సేకరించగా.. హెచ్5ఎన్8 జాతికి చెందిన వైరస్‌ను గుర్తించారు.