Sep 15,2021 18:26

భోపాల్‌ : విద్యార్థులపై కాషాయీకరణను రుద్దేందుకు ప్రయత్నిస్తోంది మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం. ఇందుకు గానూ అండర్‌ గ్రాడ్యుయేట్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ఇతిహాసాలకు సంబంధించిన పాఠాలను చొప్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠ్యాంశాలను సవరించనుంది. ఇందులో రామేశ్వరం సమీపంలో బంగాళాఖాతంలో నిర్మితమైన రామసేతు గురించి బోధనలు చేయనున్నారు. వాస్తవానికి రామసేతును లంకకు వెళ్లేందుకు రాముడు కట్టించాడని కొందరు హిందుత్వవాదులు చెబుతుంటారు. తులసీదాస్‌ రచించిన రామ్‌ చరిత మానస్‌ను బిఎ ఎలక్టివ్‌ కోర్సులో సబ్జెక్టుగా తీసుకురానున్నారు. ఇందులో భారతీయ సంస్కృతి పునాదుల్లో ఆధ్యాత్మికత, మతం, వేదాల్లో నాలుగు యుగాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి అంశాలు ఉండనున్నాయి. రామాయణానికి, రామచరిత మానస్‌కు మధ్య వ్యత్యాసం వంటి అంశాలు కూడా చొప్పించనున్నారు. అదేవిధంగా ఫౌండేషనల్‌ ఇంగ్లీష్‌ కోర్సులో సైతం సి. రాజగోపాలాచారి రచించిన మహాభారత పరిచయం ఉండనుంది. వ్యక్తిత్వ వికాసం, వివిధ కోణాల్లో దృష్టి సారించడం ద్వారా నాయకత్వ సామర్థ్యం, మానవతా వైఖరి వంటి వాటిపై విద్యార్థులు అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్లాలని చెబుతూ వీటిని తీసుకువస్తోంది.
ఈ మార్పులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. గత మా ఇతిహాసాలను ఇప్పుడు ముందుకు తెస్తున్నామని అన్నారు. రామ సేతు మిలియన్‌ సంవత్సరాల క్రితం నిర్మించిన మానవ నిర్మిత వంతెనగా నాసా నిరూపించిందని.. కాని ఇదంతా అబద్దమని అన్నారు. రామ సేతు ఎలా ఉనికిలోకి వచ్చిందని అనేదానిపై ఎటువంటి వాదనలు చేయలేదని.. అమెరికన్‌ సైన్స్‌ చానల్‌ విడుదల చేసిన ప్రోమో వీడియోను ఆధారంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యాంశాలను మార్పులు చేయడంపై బిజెపి సర్కార్‌ఫై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్య మరింత కాషాయీకరణ చేయబోతుందని విమర్శించారు. మహాభారతం, గీత, రామ చరిత మానస్‌ బోధనలతో ఎలాంటి సమస్య లేదు కానీ, మతసామరస్యాన్ని పెంపొందించేందుకు బైబిల్‌, ఖురాన్‌, గురుగ్రంధ్‌ సాహిబ్‌ వంటి పాఠ్యాంశాలను సిలబస్‌లో చేర్చాలని అన్నారు. కానీ బిజెపి అలా చేయదని, దాని సిద్ధాంతానికి సరిపోదని కాంగ్రెస్‌ నేత పిసి శర్మ అన్నారు.