Jun 11,2021 06:58

    ఖరీఫ్‌ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కంటితుడుపు చర్యలా వుందే తప్ప ప్రస్తుత పరిస్థితికి ఏమాత్రమూ తగినట్టు లేదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే డీజిల్‌, ఎరువుల ధరలను విపరీతంగా పెంచగా విత్తనాలు, పురుగుమందులు తదితర వ్యవసాయ ఉత్పాదకాల ధరలను వ్యాపారులు పెంచారు. వెరసి రైతుకు వ్యవసాయం పెనుభారమైపోతుంటే కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధరలను నామమాత్రంగానే పెంచి ప్రకటించడం అమానుషం. రిటైల్‌ మార్కెట్‌లో (ధరల పెరుగుదల) 2021-22లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని రిజర్వ్‌ బ్యాంకు తాజాగా ప్రకటించింది. కేంద్రం బుధవారంనాడు ప్రధాన పంటలైన వరి, అపరాలు, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ధరల పెంపు 1.08 నుండి 3.81 శాతం మాత్రమే! అదే కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరను ఒక్క మే నెలలోనే ఐదు శాతం పెంచింది. గత ఏడాదితో పోల్చితే డీజిల్‌ ధర పెరుగుదల 30 శాతం పైమాటే! మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ప్రారంభమై బుధవారం నాటికి 195 రోజులైంది. ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలివ్వాలని, వాటి అమలుకు చట్టబద్ధ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనీ దేశమంతటా అన్నదాతలు ఆందోళన సాగిస్తున్నారు. పంట పండించడానికయ్యే ఖర్చు, కుటుంబ శ్రమతోపాటు కౌలు మొత్తాన్ని, పెట్టుబడిపై రైతు చెల్లించే వడ్డీలు వగైరాలన్నీ కలిపి సమగ్ర ఉత్పత్తి వ్యయం (సి 2) మొత్తానికి కనీసం 50 శాతం కలిపి ఎంఎస్‌పి ని ప్రకటించాలని స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. కేంద్రం కేవలం పంటకయ్యే ఖర్చు, కుటుంబ శ్రమను (ఎ2) మాత్రమే లెక్కించి దానిపై 50 శాతం కలిపి మద్దతు ధరలను ప్రకటించడం దారుణం. ఇదో పెద్ద జుమ్లా (మోసం) అన్న సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యాఖ్య ప్రత్యక్షర సత్యం.
    వరి గ్రేడ్‌ ఎ కు ఎంఎస్‌పి రూ.1,940 గా కేంద్రం ఖరారు చేసింది. గత ఏడాదితో పోల్చితే నామమాత్రంగా రూ. 72 పెంచింది. వరి క్వింటాలు ఉత్పత్తి వ్యయం రూ. 1,293 అనీ, దానికి 50 శాతం కలిపి ఎంఎస్‌పి ప్రకటించామని కేంద్రం పేర్కొంది. కానీ వరి ఉత్పత్తి వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.2,114 అనీ, పంజాబ్‌ ప్రభుత్వం రూ.1995 అనీ, కేరళ సర్కారు రూ. 2,582, బిజెపి పాలనలోనే వున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ.2733 గా కేంద్రానికి నివేదికలు సమర్పించి వున్నాయి. ఈ లెక్కల్లో ఏ ఒక్కదాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా ఎంఎస్‌పి ఇంకా ఎక్కువగానే ప్రకటించాలి. అఖిల భారత కిసాన్‌సభ దేశవ్యాప్తంగా సగటు సమగ్ర ఉత్పత్తి వ్యయం (సి2) క్వింటాలుకు రూ.1,727గా అంచనా వేసింది. ఆ ప్రకారం లెక్కిస్తే ఎంఎస్‌పి రూ.2,590 చెల్లించాలి. కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పి అంతకంటె రూ.650 తక్కువగా ఉంది. అంటే రైతుకు ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పి దక్కినా (రైతుకు ఎంఎస్‌పి దక్కడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే) ప్రతి క్వింటాలుకూ రూ.650 నష్టపోతాడన్నమాట. అన్ని పంటల విషయంలోనూ కొంచెం అటు ఇటుగా ఈ దగా జరుగుతోంది. ఆ మోసానికి మోడీ సర్కారు అన్నివిధాల అండదండలిస్తోంది. అందుకే అన్నదాతలు ఆ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు.
    కేరళ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ప్రకటించిన వరి మద్దతు ధరకు అదనంగా బోనస్‌ చెల్లిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పత్తి పంటకు బోనస్‌ ఇస్తోంది. పరిమిత వనరులున్నప్పటికీ రైతును ఎంతో కొంత ఆదుకోవాలని, కొన్ని చోట్ల రైతు ఉద్యమాలకు తలొగ్గి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా చెల్లిస్తుంటాయి. అయితే, కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించని పండ్లు, కూరగాయలకు సైతం కనీస కొనుగోలు ధరను ప్రకటించి అమలు చేయడం రైతులను ఆదుకోవాలన్న దృఢ సంకల్పానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని సి2+50 శాతం లెక్కగట్టి ఎంఎస్‌పి ని ప్రకటించాలి. అలా చేయకపోతే ఆ సర్కారుకు వ్యతిరేకంగా వ్యవసాయదారులంతా మరింత ఐక్యంగా ఉద్యమించాలి. తద్వారా ప్రభుత్వం మెడలు వంచాలి. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పి ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలి. అప్పుడే రైతుకు నిజమైన భరోసా కల్పించిన ప్రభుత్వంగా రైతులు గుర్తిస్తారు.