Nov 18,2020 06:54

ఎప్పుడో
ఆర్థికంగా తగిలిన గాయం
ఇంకా మానలేదు
మధ్య తరగతి కష్టాలే నష్టాలై
పాత పుండు మీద
కారమై చల్లుతుంటే
నొప్పిని భరిస్తూ
బతుకీడుస్తున్న వాళ్ళం
పలుగాకులు గాయంపై
పొడుస్తున్నప్పుడల్లా
నమ్మిన నేతలు అదృశ్యమై
చీకటి అలుముకున్నప్పుడల్లా
చిప్పడు కన్నీళ్ళ రుచిని
చవిచూస్తున్న వాళ్ళం
ఎజెండాను నమ్ముకుని
జెండాలు మోసిన చేతులు
జై కొట్టిన నోర్లు
ఒట్లకై వెనువెంట తిరిగిన కాళ్ళు
దీన స్థితి గాయాలపాలైతే
మొక్కిన చేతులు కూడా
కానరాకుండా పోయాక
ఆర్థిక స్థితి గాయాలతో
బతుకు నొప్పిని భరిస్తున్నవాళ్ళం
మాయని ఈ గాయం
ఒళ్ళంతా పాకిపోక ముందే
ఆర్థిక మందు రాసే నేత కావాలి
కొంతలో కొంతైనా
వెన్ను తట్టే మనిషి కావాలి.
                               - నరెద్దుల రాజారెడ్డి, సెల్‌ : 96660 16636