Jan 13,2021 18:10

కోలీవుడ్‌స్టార్‌ హీరో 'ఇళయ దళపతి' విజరు. కొన్నేళ్లుగా విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన నటించిన 'మాస్టర్‌' చిత్రం సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులకు తగ్గట్టుగా విజరు అలరించారా? లేదా?

కథ : సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో జేడీ (విజరు) సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటారు. మద్యానికి బానిసై ఏమాత్రం నియమ నిబంధనల్ని పాటించని ప్రొఫెసర్‌గా ఉంటాడు. దీంతో తోటి సిబ్బందికి తలనొప్పిగా మారతాడు. అయితే కాలేజీ యాజమాన్యానికి కానీ.. మిగతా సిబ్బందికి కానీ ఏమాత్రం నచ్చని జేడీ.. విద్యార్థుల్లో మాత్రం మంచి ఫాలోయింగ్‌ ఉంది. అది ఎంతలా అంటే.. జేడీ సర్‌ ఉంటేనే కాలేజీలో ఏ కార్యక్రమమైనా జరుగుతుంది. లేకపోతే విద్యార్థులు దాన్ని జరగనివ్వరు. అంతలా.. విద్యార్థులు జేడీని అభిమానిస్తారు. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యానికి ఇష్టం లేకపోయినా.. స్టూడెంట్స్‌ ఎలక్షన్స్‌ జరపాలని జేడీ పట్టుబడతాడు. అయితే ఎలక్షన్స్‌ జరిగేటప్పుడు ఏ చిన్న గొడవ జరిగినా.. కాలేజీ నుంచి వెళ్లిపోవాల్సిందేనని ప్రిన్సిపల్‌ షరతు పెడతాడు. ఆ షరతు మేరకు ఎలక్షన్స్‌ జరుగుతాయి. కానీ ఎలక్షన్స్‌ జరిగే సమయంలో కాకుండా.. ఆ తర్వాత ఓ పెద్ద గొడవ జరుగుతుంది. దీంతో ప్రిన్సిపల్‌ పెట్టిన షరతు మేరకు జేడీ కాలేజీని వీడి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జేడీకి జువైనల్‌ అబ్జర్వేషన్‌ హోంలో ఉపాధ్యాయుడిగా పనిచేయాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అక్కడికెళ్లాక ఎటువంటి అనూహ్యమైన పరిస్థితుతులు జేడికి ఎదురవుతాయి. జువైనల్‌ హోంను అడ్డం పెట్టుకొని భవాని (విజరుసేతుపతి) ఎటువంటి అరాచకాలకు పాల్పడతాడు. వాటినెలా జేడి ఎదుర్కొంటాడు? అసలు జువైనల్‌ హోంకు భవానికి ఉన్న సంబంధం ఏమిటి? భవాని ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యాన్ని జేడీ ఏవిధంగా కుప్పకూల్చాడు. చారు (మాళవిక) ఎవరు? జేడీ జీవితంలో ఆమె స్థానం ఏమిటి అనేది మిగతా కథ.

విశ్లేషణ : మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న విజరు అభిమానులను నిరాశపర్చకుండా ఉండే అన్నీ హంగులూ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో విజరు నటన ఆకట్టుకుంటుంది. అభిమానుల ఊహకు తగ్గట్టే.. మాస్‌ ఫాలోయింగ్‌ తగ్గకుండా.. దర్శకుడు చిత్రీకరించరనేది స్పష్టంగా అర్థమౌతుంది. ఇక విలన్‌గా చేసిన విజరుసేతుపతి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన చేసిన పాత్ర మరెవరూ చేయనివిధంగా నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఖైధీ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారు. అయితే మాస్టర్‌ సినిమా మాత్రం ప్రేక్షకుల ఊహకు ముందే తెలిసిపోతున్నట్లుగా... ఏమాత్రం ఆసక్తికరంగా లేనివిధంగా చిత్రీకరించారు. అంటే ఒకరకంగా చెప్పుకోవాలంటే.. విజరు అభిమానులకు తగ్గట్టుగా డైరెక్ట్‌ చేశారనిపిస్తోంది. దాంతో సామాన్య ప్రేక్షలు మాత్రం స్వీకరించే పరిస్థితి లేదనిపిస్తోంది. ఇక చారు పాత్రలో మాళవిక మోహనన్‌ మెరుస్తుంది. ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, తెరపై కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇందులో అనిరుధ్‌ సంగీతం బాగుంది.