Dec 05,2021 19:14

రంగయ్య ఒకరోజు నది ఒడ్డున చెట్టును నరుకుతూ ఉండగా అతని చెయ్యి జారి గొడ్డలి నీటిలో పడి పోయింది. అప్పుడు రంగయ్య 'మాతా! నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఎక్కడ ఉందో చూసి, నాకు అందించు తల్లీ'' అని జల దేవతను ప్రార్థించాడు. అప్పుడు జలదేవత ప్రత్యక్షమై గొడ్డలిని తెచ్చి రంగయ్యకు ఇచ్చింది. రంగయ్య దానిని అందుకొని ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు.
జల దేవత రంగయ్యను 'ఈ గొడ్డలితో ఏం చేస్తావు?' అనడిగింది. 'చెట్లను నరుకుతాను మాతా!' అన్నాడు రంగయ్య. 'నీటిలో గొడ్డలి పడిపోయినప్పుడు నువ్వు నన్ను ప్రార్థించావు కదా! అలాగే చెట్లు కూడా వాటిని నరకవద్దని నిన్ను ప్రార్థిస్తున్నాయి' అంది జలదేవత. రంగయ్య ఆలోచనలో పడ్డాడు. అప్పుడు దేవత 'నువ్వు చెట్లు నరికి వేస్తే నీకు కలప మాత్రమే వస్తుంది. అదే చెట్టును నరకకుండా ఉంటే ఎన్ని లాభాలున్నాయో ఆలోచించు. చెట్ల నుంచి, మొక్కల నుంచి నువ్వు పండ్లు, పూలుకోసు కుని అమ్ముకోవచ్చు. ఎప్పుడు అలసిపోయినా చెట్ల కింద కూర్చుంటే చల్లని నీడతో, గాలితో అలసట తీరుస్తాయి. చెట్లనుంచి జబ్బులను నయంచేసే ఔషధాలు లభిస్తాయి. సంపాదించుకోవలసింది చెట్లను నరికి కాదు, మొక్కలను పెంచి కూడా హాయిగా బతకవచ్చు' అని వివరించి వెళ్లిపోయింది. ఆ తరువాత రంగయ్య చెట్లను నరకటం మానేశాడు. ఎన్నో మొక్కలు నాటుతూ వాటి ఫలాలతో జీవనోపాధి పొందాడు.
                    - సభావత్‌ చంటి, 9వ తరగతి, నేరళ్ళ పల్లి బాలానగర్‌ మండలం, మహబూబ్‌ నగర్‌ జిల్లా