Feb 28,2021 06:45

నిత్యజీవితంలో మనిషికి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఏదీ మనం కోరుకున్న విధంగా సాగదు. మనకు నచ్చిన విధంగా అన్నిటికీ పరిష్కారాలు దొరకవు. అలాగని ప్రతిదానికీ సర్దుకుపోవడం, లొంగిపోవడం మానవనైజం కాదు. మనిషి సహజ ప్రవృత్తి అదికాదు. కొంతమంది ఆధ్యాత్మికవాదులు... నిన్ను నువ్వు తగ్గించుకోవాలి... సర్దుకుపోయి జీవించాలి అని చెబుతుంటారు. కుటుంబంలోనో, రోజువారీ జీవితంలోనో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకు సర్దుకుపోవచ్చు. అలా సర్దుకుపోయినప్పుడే మన బంధాలు నిలుస్తాయి కూడా. కానీ మనం కష్టపడి సంపదను సృష్టిస్తే... ఏ కష్టమూ లేకుండా ఆ సంపదను సునాయాసంగా దోచుకుపోతుంటే అప్పుడూ సర్దుకుపోవాలా? పోతేపోయిందిలే అని ఊరుకోవాలా? తామరాకు మీద నీటి బొట్టులా వుండాలి.... ఏ కష్టానికీ చలించకూడదు.... స్థితప్రజ్ఞతతో వుండాలని అనుకుంటూ... కళ్ళెదుటే దేశసంపదను కొల్లగొడుతుంటే... మౌనంగా ఊరుకోవాలా? సర్దుకుపోవడమే సహజలక్షణం అని, సర్దుకుపోయేవారు తెలివైన వారని భావించేవారు మనలో ఎక్కువే. వీరిలానే సుమతీ శతక కారుడు కూడా 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' అంటూ గోడమీది పిల్లివాటంనే ప్రదర్శించాడు. అయితే, పరిస్థితులేవైనా.... కళ్ళముందు జరుగుతున్న దారుణాన్ని ప్రశ్నించేవారు, ఎదిరించేవారు... దానిపై పోరాడేవారే నిజమైన మానవ సహజ ప్రవృత్తిగలవారు.


మానవజాతి సహజలక్షణం పోరాడి పరిస్థితులను మార్చడం. మానవ సమాజం ప్రారంభంలో నాటి మనిషి సర్దుకుపోయి వుంటే, ఇవాళ అనంతమైన సముద్రంపైకి పోగలిగేవారం కాదు. గాల్లోకి ఎగరలేమని రైట్‌బ్రదర్స్‌ సర్దుకుపోయి వుంటే... ఇవాళ విమానాల్లో విహరించగలిగేవారమా? చీకటితోనే సర్దుకుపోయివుంటే, రాళ్లతోనే నిప్పు రాజేసుకుంటూ వుంటే... విద్యుత్‌ వచ్చేదా? ఇటీవలే మార్స్‌పైకి రోవర్‌ను సైతం పంపగలిగాం. 'గ్రహరాసులనధిగమించి ఘనతారల పధము నుంచి/ గగనాంతర రోదసిలో గంధర్వగోళగతుల దాటి/ చెంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగిరాగలిగే/ మానవుడే మహనీయుడు' అంటాడు ఆరుద్ర. మానవ మనుగడకు సంబంధించి ప్రధాన సవాళ్లు ఎదురైనప్పుడు సర్దుకుపోయే తత్వాన్ని వదిలి... పట్టుదలతో ఎదిరించిపోరాడటం ద్వారా పరిస్థితులను తనకు అనుకులంగా మార్చుకున్నప్పుడే మానవుడు పురోభివృద్ధి చెందుతాడు.


కరోనా కష్టకాలంలో దాన్ని నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా పోరాడి... చివరకు వ్యాక్సిన్‌ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను అందరికీ ఎలా అందించాలా అని ఒక యుద్ధమే చేస్తున్నారు. అంతేగాని దాన్ని వదిలేసి అడవుల్లోకో బంకర్లలోకో పారిపోలేదు. ఒకప్పుడు పేదరికంతో మగ్గిపోయిన చైనా... నేడు పేదరికానికి కూడా వ్యాక్సిన్‌ కొనుగొన్నది. పేదరికంపై పోరాడి జయించింది. అసలు పోరాటమే దండగ అనేవారు... ఇప్పుడు కరోనాపై ఎందుకు పోరాటం చేస్తున్నారు. ఏ పొరుగు దేశమైనా మన దేశంపై దాడిచేస్తే.. పోరాడుతున్నాం తప్ప ఎందుకు సర్దుకుపోవడంలేదు..? ఎందుకంటే... ప్రతికూలతపై పోరాటం మానవ ప్రవృత్తి గనుక. రాష్ట్రానికే మణిహారం వంటి విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటు కార్పొరేట్లకు అమ్మేస్తుంటే... సర్దుకుపోదాంలే అని ముఖ్యమంత్రి అనుకుంటే, ఆయన వరకు బాగానే వుండొచ్చునేమో.... కానీ రాష్ట్రప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. కనుక మన హక్కుల రక్షణ కోసం పోరాడాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది.


కేవలం ఐదారుగురు కార్పొరేట్లకోసం 130కోట్ల మందిని సర్దుకుపొమ్మని సాక్షాత్తూ ప్రధానమంత్రే చెబుతున్నారు. అప్పుడు కూడా కనీసం ప్రశ్నించలేని పరిస్థితిలో మనముంటే... 'మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలె నక్కల వలె...' అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా... మనదీ ఒక బతుకేనా..? మానవుడిలో స్వతహాగా వుండే లక్షణం... కష్టాలను అధిగమించేందుకు సాగించే పోరాటం. అవదులులేని చైతన్యపరిధి పోరాటం. గాంధీ మహాత్ముడైనా... మనిషి మహనీయుడైనా పోరాటం వల్లనే సాధ్యం. అన్యాయాలు జరుగుతున్నా సర్దుకుపోవాలనే లక్షణాన్ని పక్కన పెట్టి... అంతర్లీనంగా వున్న మహనీయతను వ్యక్తం చేసే పోరాట లక్షణాన్ని ముందుకు తెద్దాం.