Aug 22,2021 12:38

సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని విమర్శకులు అంటుంటారు. అయితే అరుదుగా అలాంటి సినిమాలు వస్తుంటాయి. మలయాళంలో ఇటీవల వచ్చిన 'కురుతి' సినిమా ఆ కోవకే చెందుతుంది. 'కురుతి' అంటే తెలుగులో రక్తం అని అర్థం. మనుషుల మధ్య క్షీణిస్తున్న సామరస్యాన్ని, సోదర భావాన్ని చూపించటమే కాకుండా దేవుని పేరిట జరిగే అర్థ రహిత హింసను హైలైట్‌ చేస్తూ రూపొందించిన సినిమా ఇది. మను వారియర్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాను పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అయిన ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం...

నటీనటులు : పృధ్వీరాజ్‌ సుకుమారన్‌, రోషన్‌ మ్యాథ్యూ, మాముకోయ
దర్శకులు : మను వారియర్‌
నిర్మాతలు : సుప్రియ మీనన్‌
సంగీతం : జేక్స్‌ బెజొరు
విడుదల తేదీ : ఆగస్టు 11, 2021
ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌

     కేరళలో ఒక పర్వత ప్రాంతాన్ని కథా స్థలంగా తీసుకొన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న చిన్న మసీదు, ప్రార్థనలకు హాజరైన అతి తక్కువ మంది మనుషులు - అది ఎక్కువ జనసాంద్రత కల ప్రదేశం కాదని అర్థం అవుతుంది. కథలోకి వస్తే ఇబ్రహీం (రోషన్‌ మాథ్యూ) తన భార్య జీనాథ్‌, కుమార్తె జుహ్రూ, అతని తండ్రి మూసా ఖాదర్‌ (మాముక్కోయ) సోదరుడు రసూల్‌ (నస్లెన్‌)తో కలిసి కేరళలోని ఈరట్టుపేటలో సాధారణ జీవితం గడుపుతుంటారు. గ్రామంలో కొండచరియలు విరిగి పడి ఇబ్రహీం కుమార్తె, భార్యను కోల్పోతాడు. పొరుగున ఉన్న ప్రేమన్‌ (మణికందరాజన్‌) భార్య కూడా మరణిస్తుంది. ఇబ్రహీం (ఇబ్రు) కుటుంబ జ్ఞాపకాలతో నిద్రపోలేకపోతాడు. ఇక ప్రేమన్‌ సోదరి సుమతి(స్రిందా) ఇబ్రూకు బట్టలు ఉతకడం, ఇంటి పనుల్లో సహాయపడుతూ పరోక్షంగా తనని ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఇవి కాకుండా అక్కడ మత గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. డబ్బున్న వాళ్లు నడిపే రాజకీయాలకు పేద ప్రజలు పావులు అవుతుంటారు. అంతకు ముందే అక్కడి గుడి ధ్వంసం జరుగుతుంది. దానికి ప్రతీకారంగా ఒక వృద్ధ ముస్లింను చంపుతారు. కథ ప్రారంభంలోనే ఆ ప్రాంతాన్ని బయట లోకానికి కలిపే ఒక బ్రిడ్జ్‌ కూలిపోయిందని, ఆ వృద్ధ ముస్లింని చంపిన హిందూ అతివాద కుర్రాడిని అరెస్టు చేయటానికి వచ్చిన పోలీస్‌ బందం ఆ ప్రాంతంలో చిక్కుబడిపోయిందనీ - మసీదు దగ్గర సంభాషణల ద్వారా అర్థం అవుతుంది. ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లటానికి ఉన్న అడవి దారి గురించి ఇబ్రహీంకూ, సుమకూ మాత్రమే తెలుసు.
     ఓ దురదృష్టకరమైన రాత్రి విష్ణు (సాగర్‌ సూర్య) అనే నిందితుడితో ఎస్‌ఐ సత్యన్‌ (మురళీ గోపీ) ఇబ్రహీం ఇంట్లోకి బలవంతంగా ప్రవేశిస్తాడు. విష్ణు తన మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఓ వ్యక్తిని హత్య చేస్తాడు. దాంతో అతడిని ఎలాగైనా చంపాలనే ఓ వర్గం వెంటాడుతూ ఉంటుంది. అయితే సత్యన్‌ అలా జరగకూడదని భావిస్తాడు. ఇబ్రూ ఇంటిలోని విష్ణుని చంపటానికి ప్రయత్నిస్తున్న ఇబ్రు స్నేహితుడు కరీమ్‌, విష్ణుని అంతం చేయటమే లక్ష్యంగా ఉన్న లైక్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) వర్గం కూడా ప్రయత్నిస్తుంటుంది. కొన్ని మలుపుల తరువాత విష్ణు జీవితాన్ని రక్షించే బాధ్యత ఇబ్రహీం మీద పడుతుంది. అతను తన స్నేహితుల ప్రతీకారానికి మద్దతు ఇస్తాడా? లేక పరమతానికి చెందిన అపరిచితుడి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తాడా? చివరికి ఏం జరిగిందన్నదే కథ.
       ఈ సినిమా కథలో ఉన్న అనేకానేక పొరలు దేశంలోని రాజకీయ, సామాజిక అంశాలను చర్చిస్తాయి. 'ఏ వోవ్‌ టు కిల్‌, యాన్‌ ఓథ్‌ టూ ప్రొటెక్ట్‌' అనే టాగ్‌లైన్‌ ఉన్నా కూడా -పైకి కనిపించినట్లు కేవలం వ్యక్తిగత పగలు, ద్వేషాలు, ప్రతీకారాలకు సంబంధించిన కథ మాత్రమే కాదిది. వాటికి మించిన విశాల కాన్వాస్‌ ఈ సినిమాకు ఉంది. హాలీవుడ్‌లో వచ్చే 'హోం ఇన్వేషన్‌' టైపు థీమ్‌ని ఉపయోగించుకొని, ఈ సినిమా పెద్ద ప్రయోజనం సాధించదలుచుకొన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి కథను ఎంచుకోవడం కత్తిమీద సామే. దానిని ఎలాంటి గందరగోళం లేకుండా తెరకెక్కించటం, అదీ ఏ మతానికి చెందిన వారినీ నొప్పించకుండా చేయటం అనే విషయంలో దర్శకుడు చూపించిన నేర్పరితనానికి ఫిదా అవ్వాల్సిందే. ఈ కథతో వచ్చిన దర్శకుడికి స్వాగతం చెప్పి సినిమా తీయటమే కాకుండా అందులో మత విశ్వాసాలను నరనరానా ఎక్కించుకున్న లైక్‌ పాత్రను పోషించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను అభినందించాల్సిందే. సంవత్సరాలుగా సన్నిహితులుగా మెలిగిన వ్యక్తులు మతపరమైన విషయం వచ్చే సరికి ఒకే రాత్రిలో ఎలా శత్రువులుగా మారతారనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. నటీనటుల విషయానికి వస్తే ఇబ్రూగా నటించిన మ్యాథ్యూ రోషన్‌, లైక్‌ పాత్ర పోషించిన ఫృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఇబ్రుని అభిమానించే సుమతిగా స్రిందా, ఇబ్రు తండ్రి పాత్ర పోషించిన మాముక్కోయ, సోదరుడు రసూల్‌గా నస్లెన్‌, విష్ణుగా సాగర్‌ సూర్య తమ తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. సినిమా కథకు అనుగుణంగా 90శాతం పైగా రాత్రివేళలో చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్‌ రామానుజం, చక్కటి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించిన జేక్స్‌ బిజోరు ప్రతిభను తక్కువ చేయలేం. థ్రిల్లర్‌గా రూపొందిన 'కురుతి' శక్తిమంతమైన సందేశాన్ని అందిస్తుంది. సమాజంలో పెరుగుతున్న మతత్వ ధోరణిని దర్శకుడు స్పృశించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చూసి తీరాల్సిన సినిమా ఇది.