Apr 12,2021 06:38

   సంపన్న వర్గాలు, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని నిలబెట్టడాన్ని నెత్తికెత్తుకున్న సంప్రదాయ సాహిత్యం ప్రశ్నని చంపేసింది. ప్రశ్నే లేని ఒక భద్రస్థితిని సృష్టించుకున్నది. కానీ బూచిని చూపించి ఎన్నాళ్ళని మనిషిని కట్టడి చెయ్యగలవు? కాలగమనంలో పరిస్థితి మారింది. అక్షరం అగ్రజున్ని వదిలేసి సామాన్యున్ని వరించింది. ఇప్పుడు సామాన్యుడు ఇన్నాళ్ళ అన్యాయానికి అక్కసు తీర్చుకుంటున్నాడు. ఆ ఆవేశంలో రచయితలు విచక్షణ కోల్పోవడం తరచుగా కనబడుతుంటుంది. సరిగ్గా అక్కడే సామాన్య రచయితకూ ఉన్నత స్థాయి రచయితకూ తేడా కనబడు తుంది. అలాంటి తేడా, నిర్మమత్వం కొలకలూరి ఇనాక్‌ గారి రంధి నవలలో స్పష్టంగా కనబడుతుంది. రంధి అంటే జిల నుంచి జగడం వరకూ చాలా అర్థాలే ఉన్నాయి. ఆ పేరు ఇతివృత్తాన్ని చక్కగా ప్రతిబింబిస్తున్నది. రంధిలో రచయిత ఆధిపత్య కులాల ఆగడాల్లో దళిత జీవితాలు ఎలా చితికిపోయేవో వర్ణించారు. కానీ అంత మాత్రానికైతే ఈ నవల గొప్ప రచన కాలేదు. దేశంలో మూలవాసులెవరు? వలసజీవులెవరు? నిజానికి ఈ దేశం ఎవరిది? చివరికి ఎవరి హస్తగతమైంది? ఈ దేశాన్ని ఇక్కడి భూమిని సిరిసంపదల్ని ఎవరి నుంచి ఎవరు కాజేశారు? ఆధిపత్యం ఎవరి చేతిలో ఉండాల్సింది? ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? మనిషిలోని ఏ ప్రకృతులు వాటికి కారణాలయ్యాయి? లాంటి చారిత్రిక సత్యాలపై చాలా లోతైన ప్రతిపాదనలు కథాగతం చేశారు. సందర్భానుసారంగా ఆయా విషయాలపై చాలా మౌలికమైన ప్రతిపాదనలు చేశారు. ఇనాక్‌ గారే చెప్పినట్టు మానవత్వ శాసనసభలో ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లు రంధి. దాన్ని కూలంకుషంగా చర్చించి శాసనం చెయ్యమని రచయిత స్వయంగా కోరారు. అందువల్ల ఈ నవల చర్చనీయమైంది.
   కొలకలూరి ఇనాక్‌ గారు తన పీడిత వర్గానికి చెందిన నాయకపాత్రలైన చందిరి, సువ్వి లాంటి పాత్రల్ని ఎంత ఆత్మీయంగా సొంతం చేసుకున్నారో అంత అసాధారణంగా పీడక వర్గానికి చెందిన ప్రతినాయక పాత్రలైన రామున్ని, నాంచారయ్యని కూడా సొంతం చేసుకున్నారు. ఆధిపత్య కులాల వాళ్ళ చేతిలో దోపిడీకి గురవుతున్న దళితుల నిస్సహాయత పట్ల ఎంత సానుభూతి చూపారో, దైహిక పోషణకోసం దళితుల్ని దోపిడీ చేసి, పైశాచికానందం కోసం వాళ్ళని క్రూరంగా హింసించి బతకడం వినా గత్యంతరం లేని ఆధిపత్య కులస్థుల నిస్సహాయత పట్ల కూడా అంతే సానుభూతి చూపారు. ఏ మానవ ప్రకృతులు వాళ్ళ చేత వాటిని చేయిస్తున్నాయో విశ్లేషించే ప్రయత్నం చేశారు. అంతం చెయ్యాల్సింది వాళ్ళని కాదనీ, వాళ్ళ స్వభావాలననీ ప్రతిపాదించారు.
   రంధిలో కథ కట్టె కొట్టె తెచ్చె కంటే కూడా చాలా చాలా చిన్నది. సింపుల్‌గా 'రెచ్చె, చచ్చె' అని చెప్పుకోవచ్చు. నాంచారయ్య, రాముడు ఫ్యూడలిస్టు భావజాలంతో సువ్వీ చందిరిలపై, పల్లెలోని మాదిగలపై అనాగరికమైన ఆగడాలతో రెచ్చిపోతారు. చివరకు మాదిగల ఆత్మబలం ముందు ఏమీ చెయ్యలేక రాముడు ఆత్మహత్య చేసుకుంటాడు. నాంచారయ్య పరివర్తన చెందుతాడు. ఇంతే కథ. మరి ఈ రచయిత 298 పేజీలు ఏం రాశారు అంటే... కథనాత్మకమైన మనో విశ్లేషణ ఉరవడిస్తూ ఉంది. దోపిడీదారులైన ప్రతి నాయకుల వ్యగ్రాలోచనల డ్రైన్‌ మిడిసిపడుతూ ఉంది. పీడితులైన మాదిగల నిస్సహాయతా చైతన్య స్రవంతి ఉవ్వెత్తున దుముకుతూ ఉంది. ఐనా ఇనాక్‌ గారు ఎదుటి పక్షాన్ని ఎక్కడా నిందించలేదు. ఆ ఎదుటి పక్షం వ్యక్తులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో దానికి గల సామాజిక సాంస్కృతిక వైయక్తిక పరిసరాల కారణాల్ని వివరిస్తారంతే.
   రంధి కథాస్థలమైన వేజండ్లలో పల్లె కుక్కలు చాకచక్యంగా వడ్డెర్ల పందుల్ని ఇటువైపు నుంచి ఒకగుంపు అటువైపు నుంచి ఒకగుంపు తరిమి రైలు పట్టాలు ఎక్కించి రైలుకింద పడి చచ్చేలా చేసి ఆ చచ్చిన పందుల్ని తింటాయి. అలాగే నాంచారయ్య తన ఇంట్లో సంపద పోగుపడ్డం కోసం మనుష్యుల్ని చంపేస్తాడు. కానీ తన చేతులకు రక్తం అంటదు. తను శిక్షకు గురికాడు. తెలివిగా వాళ్ళను ఉచ్చులో బిగించి గుక్కతిప్పుకోకుండా చేస్తాడు. వాళ్ళ ఆస్తుల్ని వేలంలో కాజేస్తాడు. అవమానం పాలై వాళ్ళు రైలు పట్టాల మీద శవాలై తేలేలా చేస్తాడు. రైలు అందరినీ సమానంగా చూస్తుంది. కానీ రైలు కింద పడే అగత్యం పనుల కోసం అటువైపు ఇటువైపు దాటాల్సిన మాదిగలకే ఉంది.
   రాముడు డబ్బులో పుట్టాడు. ఆధిపత్య భావజాలంలో పెరిగాడు. సువ్వి అంటరాని కులంలో పుట్టింది. అందంగా పుట్టింది. ఆ కాలంలో అది శాపం. అందువల్ల ఆమె ఆత్మన్యూనతలో పెరిగింది. రామునిది అగ్రకుల అహంకారం, సువ్విది ఆత్మగౌరవ పోరాటం. సువ్వికి చదువుకోవాలని ఉంది. టీచరమ్మ కావాలని ఉంది. మాదిగది చదవడమేంది? అంటాడు రాముడు. స్కూలుకు వెళ్ళేటప్పుడు తను ఉన్న రైలుపెట్టె ఎక్కవద్దంటాడు. మాదిగలు తమ బానిసలని రాముని నమ్మకం. అతడు అలాంటి వాతావరణంలో పెరిగాడు. మనిషి పుట్టుకతో ఫ్యూడలిస్టు కాడు. పెంపకంతో అవుతాడని ప్రతిపాదిస్తారు రచయిత.
   సువ్వి అందంగా ఉండడం వల్ల రాముడు తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడ్డాడు. ఐతే దాన్ని ఒప్పుకోడానికి అతని అభిజాత్యం అడ్డు వచ్చింది. ఆమెను పొందడానికి మాదిగదైన ఆమెకు ఆ అర్హత లేదు. ఆమెను పొందలేని నిస్సహాయతలోంచే ఆమెపై అతనికి అసూయ పుట్టింది. ఆగ్రహంగా మారింది. ఆమెని తాకాలన్న ఇష్టమో, కొట్టాలన్న ఆగ్రహమో తెలియకుండానే ఆమె ఎదుర్రొమ్ముపై చెయ్యివేశాడు. తన ఒంటిపై పరాయివాడు చెయ్యేస్తే ఏ మానవతి ఊరుకొంటుంది? ఆమె కూడా చెయ్యేసింది, వాడి చెంపపై. కానీ ఆ చెయ్యి కాలాన్ని అధిగమించి వేసిన చెయ్యి. అందువల్ల రాముడి అహం దెబ్బతింది. నడుస్తున్న రైల్లో పదిమందిలో సువ్విని రక్తం ఓడేలా చెరుస్తానని ఒట్టు పెట్టుకుంటాడు. చెరపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత, పంచాయితీ వాళ్ళు విధించిన పరిహార ధనం మొహాన కొట్టిందని అపార్థం చేసుకుని చంపుతానని కూడా శపథం చేస్తాడు. ఆమెని పెళ్ళాడిన చందిరిని చంపి ఆమెని దిక్కులేని విధవని చేసి తను ఉంచుకుంటానని అంటాడు. అలాంటి కొడుకును దండించాల్సిన నాంచారయ్య రామున్ని ఇంకా రెచ్చగొడతాడు. దానికి వాళ్ళ అభిజాత్యం, కాల స్వభావం దన్నుగా నిలిచాయి.
   రంధి నాయికా ప్రధాన రచన. పారతంత్య్రంలో కూరుకుపోయిన మాదిగ కులంలో స్వతంత్ర భావాలతో పుట్టి, రాముని రూపంలో ఎదురైన అగ్రవర్ణ అసూయా అవాంతరాన్ని దాటి, లక్ష్యంవైపు దూసుకెళ్లి తన చదువు కొనసాగించిన సువ్వి కథానాయిక. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా సువ్వి చదువుకు అడ్డుపడకుండా ఆమెకు సహకరించిన ఆమె తండ్రి కోటి, తల్లి బూది, నాయనమ్మ లింగి ఆదర్శవంతమైన పాత్రలు. రజాకార్ల ఆగడాల నుంచి తప్పించుకోడానికి నల్గొండ జిల్లా నుంచి పారిపోయి వచ్చిన అంజవ్వ వెంకటిల కొడుకైన చందిరి కథానాయకుడు. చందిరి తల్లిదండ్రుల్ని చిన్నప్పుడే కోల్పోయాడు. దురదృష్టం వెన్నాడి బాల్యంలోనే గొంతు పోగొట్టుకుని మూగవాడయ్యాడు. ఐనప్పటికీ ఆ పాత్రని ఇనాక్‌ గారు గొప్పగా తీర్చిదిద్దారు. అనాథ ఐన చందిరిని అతని మంచితనం చూసి మొదట డాబా సత్తెయ్య, తర్వాత బైరాగి మనుమడిగా ఆదరించారు. భాష రాని చందిరి తన చేష్టల ద్వారా, ముఖకవళికల ద్వారా ఎంతో మాట్లాడగలడు. మూగవాడైన చందిరి మిషగా రచయిత భాష యొక్క తత్త్వాన్ని, దాని స్థితిగతుల్ని చక్కగా వర్ణించారు. శూద్రులైన నాంచారయ్య రాముడుల్ని ఎదిరించడం మాదిగలకు చెయ్యరాని సాహసం. ఆ దిశగా ప్రోత్సహించి మాటల పొదుపుతో చందిరిని నడిపించి మాదిగల విజయానికి కారకుడైన బైరాగి పాత్రని తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు.
   వేజండ్లలో మాదిగ సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళు వేజండ్ల ఇంటిపేరువాళ్ళు. మాదిగల వివాహాది కర్మలు నిర్వహించేవాళ్ళు మాదిగ దాసర్లు. మిగిలిన మాదిగలు అలగా మాదిగలు. హిందూ వర్ణవ్యవస్థలో ఎలా నిచ్చెనమెట్లు ఉన్నాయో అలా మాదిగల్లో మళ్ళీ నిచ్చెనమెట్లు ఉన్నాయి. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చిన్నచూపు చూస్తారు. వాళ్ళలో వాళ్ళు అంటరానితనం పాటిస్తారు. ఒకరితో ఒకరు వివాహ సంబంధాలు పెట్టుకోరు. ప్రజాస్వామ్య యుతమైన సంఘవ్యవస్థ అక్కడ అనాదిగా ఉంది. అక్కడి మాదిగల నాయకుడు వేజండ్ల ఇంటివాడైన పెద్ద మాదిగ. ఒక్కొక్క తెగకు ఒక మాదిగపెద్ద నాయకుడుగా ఉంటాడు. పెద్ద మాదిగ నాయకత్వంలో మాదిగ పెద్దలు నిర్ణయాలు చేస్తారు. ఇలా ఇంటిపేర్లతో వేళ్ళూనుకున్న మాదిగల సామాజిక విభజనని, సంఘ నిర్మాణాన్ని, సంఘ నిర్ణయాలకు కట్టుబడే మాదిగ స్వభావాన్నీ, ఐక్యతని రచయిత పాఠం చెప్పినట్లు వర్ణించారు.
   కొడుకు చనిపోవడం వల్ల నాంచారయ్యలో వైరాగ్యం కలిగి మార్పు వచ్చిందని, మాదిగలపై అక్కసు పోయి అభిమానం కలిగిందని, సువ్వి చందిరిలపై ఆగ్రహం పోయి వాత్సల్యం పుట్టిందని, అపోహ పడ్డానికి కూడా అవకాశం ఉంది. కానీ అది వాస్తవం కాదు. నాంచారయ్యలో మార్పు రావడానికి కారణం సమాజం. అవసరమైన ప్పుడు తన వద్ద సాయం పొంది తనకు అవసరమైనప్పుడు వీడికీ మనకూ మధ్య ఉన్నవి ఆర్థిక సంబంధాలే కానీ మానవ సంబంధాలు కావని బాసటగా నిలవని బంధువులు. చేసాయం చెయ్యని మిత్రులు. అది ఎరుకైన తర్వాతే డబ్బు కన్నా మనుష్యుల్నీ, మానవ సంబంధాల్నీ సంపాదించుకోవాలని అతనికి తెలిసింది. తన సిరిసంపదలకు కారకులు మాదిగలనీ, తను ఆదరించినా మాదరించినా తన సుఖద్ణుఖాల్లో కాన్పు నుండీ కాటి వరకూ ఎప్పుడూ తన వెన్నంటి ఉన్నది ప్రేమైక మూర్తులైన మాదిగలే అనీ, దానికి కృతజ్ఞతగా ఇక మీదట వాళ్లకు బాసటగా వాళ్ళతోనే ఉండాలనీ అతనికి తెలిసొచ్చింది. ఈ అభిప్రాయాల్ని ఎస్టాబ్లిష్‌ చెయ్యడం రచయిత ప్రధానోద్దేశం. అందుకే ఆయన వీటిని స్పష్టంగా వాచ్యం చేశారు.
   రంధి కథ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళ నాటిది. అంటే ఇనాక్‌ గారి చిన్నతనం నాటిది. అప్పట్లో ఆధిపత్య కులాలు కింది కులాలపై చేసే దోపిడీ ఆగడాలు అత్యాచారాలూ చాలా బహిరంగంగా నిస్సిగ్గుగా ఉండేవి. అందువల్ల ఈ నవల అప్పట్లోనే రాయబడి ఉంటే చాలా ప్రయోజనకరంగా ఉండేది. ఎంతో సామాజిక చైతన్యం తెచ్చి ఉండేది. అయినా ఈ విమర్శ వల్ల రంధికి వచ్చిన నష్టం ఏమీ లేదు. సంయమనం అనే నెయ్యి దట్టించిన తిరగమోతతో ఉప్పూకారం చప్పబడినా ఆ దట్టించిన నెయ్యి కారణంగా రంధి షడ్రసోపేతంగా ఉంది.
   సువ్వి ఆత్మికశక్తిని గెలవలేక, దళితుడూ మూగవాడూ ఐన చందిరి చేతిలో ఘోరంగా అవమానం పాలై రాముడు రైలు కింద పడి చచ్చాడు. అతన్ని చూడ్డానికి వాళ్ళ కుటుంబం అంటే పడేవాళ్ళే కాదు పడనివాళ్ళు కూడా వచ్చారు. ఎదురుగా చచ్చి పడి ఉన్నది ఒక ఆకతాయి. అయినా అందరూ కన్నీరు పెట్టుకున్నారు. విలపించారు. అది పల్లెటూళ్ళ సుగుణం. అంతే కాదు శత్రువులైన సువ్వి, చందిరి, కోటి, బైరాగి కూడా వచ్చారు. శత్రువు చచ్చి పడున్న ఆ స్థితిలో ఒక అగ్రవర్ణ పురుషుడు అయ్యుంటే వాడి తొడలు తానే విరగ్గొట్టినట్టు ఊహించుకుని ఉత్సాహపడి ఉండేవాడు. ఒక సవర్ణ స్త్రీ అయ్యుంటే అన్నాళ్ళూ పంతంతో ముడివేసిన జుట్టుముడి విప్పి వాడి రక్తం తలకు పూసుకుంటు న్నట్టు సంబరపడి ఉండేది. కానీ సువ్వికి దు:ఖం తన్నుకొచ్చింది. వలవలా ఏడ్చింది. శ్మశానానికి రాముని శవాన్ని ఎత్తడానికి బంధువులు ఎవరూ రాకపోగా మాదిగలే మోశారు. చందిరి దగ్గరుండి శవదహనం చేశాడు. అది సవర్ణుల బండతనానికి అవర్ణుల చిత్త సంస్కారానికీ ఉన్న తేడా. అది కట్టుకథ కాదు. అది ఏ వైపూ మొగ్గని ఇనాక్‌ గారి నిర్మమత్వానికి తార్కాణం. అది మాదిగల మానసిక నైజానికి, హృదయ ద్రవీభవన గుణానికి ఉదాహరణ. అన్యాయానికి గురికావడంలోనే కాదు, అన్యాయం చెయ్యాల్సి రావడంలో కూడా మానసికమైన నిస్సహాయత ఉందని అంటుంది రంధి. ''ఒకణ్ణి చంపి ఇంకొకడు బతకడం చావు కన్నా హీనం'' అంటుంది. ''చంపుతాననే మనిషేం మనిషి?'' అని ప్రశ్నిస్తుంది. ''చంపటం ప్రబోధించే సాహిత్యం ఏం సాహిత్యం?'' అంటూ పవిత్రాలుగా చెలామణి అవుతున్న మత గ్రంథాల్ని కూడా నిలదీస్తుంది. అందుకే మానవతా పరమావధి - రంధి.
 

- కవితశ్రీ (డా. డేరంగుల శ్రీనివాసులు)