Aug 01,2021 10:21

సినిమా సెలబ్రిటీలు తమ అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్‌ మీడియాలో చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో అనేక మంది సెలబ్రిటీలు తమ అభిమానులతో ఏదో ఒక విషయమై చర్చించడం, సలహాలు, సూచనలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. కొన్నిసార్లు వారి జీవితానుభవాలను, వాటిని అధిగమించడానికి వారు చేపట్టిన చర్యలను సైతం అభిమానులతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికాపదుకొనె ఏడేళ్ల క్రితం తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.

పేరు : దీపిక పదుకొనె
పుట్టిన తేదీ : జనవరి 5, 1986
పుట్టిన ప్రాంతం : కోపెన్‌ హగెన్‌, డెన్మార్క్‌
నివాస ప్రాంతం : బెంగళూరు, కర్ణాటక
చదువు : బిఎ (సోషియాలజీ)
హాబీస్‌ : కుక్కింగ్‌, రీడింగ్‌, బ్యాడ్మింటన్‌
భర్త : రణ్‌వీర్‌ సింగ్‌
తల్లిదండ్రులు : ఉజ్వల పదుకొనె,
ప్రకాష్‌ పదుకొనె
సోదరి : అనీష పదుకొనె

    హిమేష్‌ రేషమ్మియా తీసిన స్వతంత్ర ఆల్బం ఆప్‌ కా సురూర్‌లోని నాం హై తేరా అనే పాటకి మ్యూజిక్‌ వీడియోలో నటించడం ద్వారా కెరీర్‌ని మొదలుపెట్టింది బాలీవుడ్‌ అగ్రతార దీపికాపదుకొనె. కాలేజీ రోజుల్లో ఉండగా మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత 2007లో షారుఖ్‌ఖాన్‌ హీరోగా ఫరాఖాన్‌ తీసిన విజయవంతమైన బాలీవుడ్‌ చిత్రం ఓం శాంతి ఓంలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇండియాలో దీపికా పదుకొనెకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె పారితోషికానికి, స్టైల్‌కి సరితూగేవారు బాలీవుడ్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. అంతేకాదు ఇండియాలో సోషల్‌మీడియాలో అందరికంటే ఎక్కవగా నాలుగు కోట్ల మంది ఫాలోవర్స్‌ రికార్డు ఈమెకే సొంతం. దీపిక నుంచి ఒక్క పోస్ట్‌ వచ్చిందంటే చాలు అదో సంచలనం అనే చెప్పాలి. ఆమె పోస్టులు నిమిషాల్లో దెబ్బకు వైరల్‌ అయిపోతాయి. దీపికాకు అంత పాపులారిటీ ఉంది.
     అయితే తరచూ సామాజిక మాధ్యమాల్లో అనేక విషయాలను దీపిక అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ సోషల్‌మీడియా వేదికలో ముచ్చటించిన ఆమె, తాను ఎదుర్కొన్న ఓ ఘటనను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో దుర్దశ ఉంటుందని, అయితే దాని నుంచి బయటపడేందుకు కుటుంబం, సన్నిహితుల తోడ్పాటు ఎంతో అవసరమని చెప్పుకొచ్చింది. ఏడేళ్ల క్రితం తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురైన తాను కౌన్సెలింగ్‌ ద్వారా కోలుకున్నానని గుర్తుచేసింది. తన జీవితంలో ఆ రోజులు సంఘర్షణతో సాగాయని చెప్పుకొచ్చింది. '2014లో నేను తీవ్రమైన డిప్రెషన్‌తో సతమతమయ్యాను. కెరీర్‌లో మంచి విజయాలు సాధించినప్పటికీ ఏదో వెలితిగా అనిపించేది. జీవితమంతా శూన్యం ఆవహించిందనే భావనలో ఉండేదాన్ని. బతకడంలో అర్థం, ఆశయం ఏమీ లేవనే ఆలోచనలు పదేపదే భయపెట్టేవి. అలా కొన్ని నెలలు గడచిపోయాయి. ఆ సమయంలో నాతో కొన్ని రోజులు గడపడానికి అమ్మనాన్న ముంబయి వచ్చారు. వారు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక్కసారిగా మా అమ్మ ముందు బోరున ఏడ్చేశాను. అప్పుడే నాలోని మానసిక వ్యాధిని అమ్మ గుర్తుపట్టింది. తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని, నాతోనే ఉండిపోయింది. అనంతరం వరుసగా కౌన్సెలింగ్‌ సెషన్స్‌కు హాజరవుతూ కుంగుబాటును దూరం చేసుకున్నా' అని దీపికా చెప్పింది. ఇప్పటికీ ప్రతిరోజూ తన మానసిక స్థితిగతులపై సమీక్షించుకుంటానని, ఏదైనా సమస్యగా అనిపిస్తే కుటుంబసభ్యులతో చర్చిస్తానని తెలిపింది. ఏ రంగంలో ఉన్న మహిళలైనా సరే కెరీర్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని దీపికా సూచించింది.
    కేవలం అభిమానుల ఆరోగ్యం గురించే కాదు.. అప్పుడప్పుడు ప్రభుత్వాల దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాడేవారికి మద్దతుగానూ నిలుస్తుంటారు. గతంలో ఢిల్లీ జెఎన్‌యులో బిజెపి అనుబంధ విద్యార్థి సంఘాలు విద్యార్థులపై జరిపిన దాడులపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా కూడా నిలిచిందామె. ప్రధాని నరేంద్రమోడీ వ్యతిరేకంగా నిలిచిన ఆమె ధైర్యాన్ని ఆ సమయంలో అందరూ మెచ్చుకున్నారు. అంతేకాదు వివిధ సందర్భాల్లో ఎన్నో వివాదాస్పద పోస్టులు పెట్టింది. అవన్నీ పెద్ద వివాదమయ్యాయి. అప్పట్లో సీఏఏకు వ్యతిరేకంగా స్పందించి, బిజెపి శ్రేణుల ఆగ్రహానికీ గురయ్యింది.
      ఇక సినిమాల విషయానికొస్తే.. రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే' లో దీపికా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కపిల్‌దేవ్‌ బయోపిక్‌ '83', షారుఖ్‌ ఖాన్‌తో 'పఠాన్‌', హృతిక్‌ రోషన్‌తో 'ఫైటర్‌' మూవీతో పాటు ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ ప్రాజెక్ట్‌ కె చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రంతో టాలీవుడ్‌లోనూ అడుగులు వేసేందుకు సిద్ధమయ్యింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'సర్కస్‌'. ఈ సినిమాలో చిన్న పాత్రలో మెరవనున్నారట దీపికా.