Sep 24,2021 01:53

ఆందోళన చేస్తున్న మానసిక వికలాంగులు, వారి తల్లిదండ్రులు

ప్రజాశక్తి- సిరిపురం
'లీజ్‌ అయిపోయిందని చెప్పి జివిఎంసి వారు జూన్‌ 5 మమ్మల్ని నడిరోడ్డు మీద తోసి దిక్కులేని వాళ్ళను చేశారు. రెండు రోజుల్లో స్కూల్‌ ఏర్పాటు చేస్తానని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ సృజన మాట ఇచ్చి నేటికి నాలుగు నెలలైనా ఏర్పాటు కాలేదు. మా స్కూలు మాకు ఇప్పించండి' అంటూ ఉషోదయ జంక్షన్‌లోని హిడెన్‌ స్పౌట్స్‌ స్కూల్‌కు చెందిన మానసిక వికలాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు గురువారం స్కూల్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్కూల్‌ నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ అప్పట్లో ఆరిలోవ చివరి బస్టాప్‌ వద్ద కళ్యాణ మండపంలో స్కూల్‌ ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ చెప్పారని, కాని అక్కడ 13వ వార్డు కార్పొరేటర్‌, కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. మళ్లీ స్కూల్‌ కోసం జివిఎంసి కమిషనర్‌ని అడగ్గా కౌన్సిల్‌లో పెట్టి స్కూల్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. స్కూల్‌ లేకపోవడంతో విద్యార్థులు, తల్లితండ్రులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పాఠశాల లేకపోవడంతో పిల్లలను ఇంట్లో తాము చూసుకోలేక పోతున్నామని, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన శిబిరంలోనే మానసిక వికలాంగులు బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది మధ్యాహ్న భోజనాలు చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ సృజన స్పందించి స్కూల్‌ ఏర్పాటు చేయాలని కోరారు.