Oct 14,2021 13:03

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలోని పెద్దలందరినీ కలుపుకొని  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అభివృద్ధికి పాటుపడతానని నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు.  ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు...  వరుసగా సినీ పెద్దలను కలిసే పనిలోపడ్డారు. ఆ క్రమంలోనే  తొలుత తనకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణను  కలిశారు. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి గురువారం ఉదయం బాలయ్య ఇంటికి వెళ్లారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు. భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనను కలవడం ఆనందంగా ఉంది. అన్నయ్య యన్‌.టి.రామారావు గారే నన్ను బాలయ్య ఇంటికి పంపించినట్లు ఉంది. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు’ అని తెలిపారు.

విష్ణు మాట్లాడుతూ..  త్వరలోనే మెగాస్టార్‌ చిరంజీవిని కూడా కలుస్తానని చెప్పారు. ‘ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఇందులో భాగంగా ఇప్పటికే కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశాను. త్వరలోనే చిరంజీవిని కలుస్తాను. ఈ ఎన్నికల్లో బాలయ్య నాకు మొదటి నుంచి ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆశీర్వాదం తీసుకోవడానికే ఈరోజు ఆయన ఇంటికి వచ్చాను. పెద్దలందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తాను’ అని  తెలిపారు.  కాగా, ఎన్నికల అనంతరం ‘మా’లో నెలకొన్న పరిస్థితుల రీత్యా బాలయ్యతో బాలయ్యతో విష్ణు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.