చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : వైసిపి విజయనగరం జిల్లా అధ్యక్షులు, విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్, విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీని వీడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో మంగళవారం రాత్రి టిడిపిలో చేరారు. దీంతో, విజయనగరం జిల్లాలో వైసిపికి గట్టి షాక్ తగిలినట్టైంది. ఈ అనూహ్య పరిణామంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అంతకు ముందు చిన్నశ్రీను వైసిపికి రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
శాసన మండలి ప్రతిపక్ష నేత, వైసిపి కీలక నేత బొత్స సత్యనారాయణకు చిన్నశ్రీను వరసకు మేనల్లుడు. బొత్స రాజకీయ వ్యవహారాలు చూస్తూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో కీలక నేతగా ఆయన ఎదిగారు. బొత్సతోపాటు కాంగ్రెస్ లోనూ, ఆ తరువాత వైసిపిలోనూ పనిచేశారు. చిన్నశ్రీను ప్రస్తుతం విజయనగరం జడ్‌పి చైర్మన్ గా ఉన్నారు. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లో వైసిపిలో అన్నీ తానై వ్యవహరించారు. చాలాకాలం నుంచి వైసిపి జిల్లా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించడంతో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. ఉత్తరాంధ్రలోనే మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటువంటి నాయకుడు టిడిపిలో చేరడంతో వైసిపి నాయకులు, కార్యకర్తలు కంగుతిన్నారు.
కొంతకాలంగా బొత్స కుటుంబానికి, చిన్నశ్రీనుకు మధ్య విభేదాలు
గత కొంతకాలంగా బొత్స కుటుంబానికి, చిన్నశ్రీనుకు మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో, ఈ రెండు కుటుంబాలూ వేర్వేరు అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. బొత్స తన కుమార్తె అనూష, కొడుకు సందీప్ ను రాజకీయాల్లోకి దింపారు. అంతకు ముందు నుంచే చిన్న శ్రీను కూతురు సిరిసహస్ర సేవా కార్యక్రమాలు చేస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా చిన్నశ్రీను బాధ్యతలు చేపట్టాక అక్కడికి ఎక్కువగా సిరిసహస్ర వెళ్తున్నారు. బొత్స, చిన్న శ్రీను తమ కుటుంబ పరివారాన్ని కూడా రాజకీయాల్లోకి దింపి, పదవుల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిన్న శ్రీను బాధ్యతలు నిర్వహిస్తున్న జడ్‌పి చైర్మన్ పదవి కోసం మరెవరూ ఆశించక్కర్లేదని, ఈసారి తన కుమార్తె అనూషను రంగంలోకి దించుతామని బొత్స ఇటీవల చిట్ చాట్ గా చెప్పిన మాట వైసిపిలోను, జిల్లా రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. నాటి నుంచి చిన్న శ్రీను పార్టీ మారుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, బొత్స, చిన్న శ్రీను మధ్య అంత గ్యాప్ లేదని, వైసిపిలో కీలకనేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చిన్న శ్రీనుకు పార్టీ మారాల్సినంత అవసరం రాకపోవచ్చని రాజకీయ నాయకుల నుంచి విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ అంచనాలను తల్లకింద్రులు చేస్తూ ఆయన వైసిపిని వీడి టిడిపిలో చేరారు.








కామెంట్‌లు (0)