శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడెమొక్రటిక్‌ సెనెట్‌ ప్రైమరీలో వామపక్ష వాది విజయం

06 ఆగస్టు, 2026

images-1786032863672-5976.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 11:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మిచిగాన్‌ : వామపక్ష వాది అయిన అబ్దుల్‌ ఎల్‌-సయీద్‌ అమెరికాలోని మిచిగాన్‌ డెమొక్రటిక్‌ సెనెట్‌ ప్రైమరీ ఎన్నికలలో గెలుపొందారు. ప్రజారోగ్య శాఖ మాజీ అధికారి అయిన సయీద్‌ తన ప్రత్యర్థి, మితవాద డెమొక్రటిక్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు హేలీ స్టీవెన్స్‌పై విజయం సాధించారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. సయీద్‌కు 7,42,017 ఓట్లు రాగా హేలీకి 7,27,091 ఓట్లు మాత్రమే లభించాయి. 1964లో సోనీ లిస్టన్‌పై అనూహ్య విజయం సాధించిన ప్రఖ్యాత బాక్సర్‌ మహమ్మద్‌ అలీ చేసిన 'మేము ప్రపంచాన్ని కదిలించాము' అనే వ్యాఖ్యను సయీద్‌ ఈ సందర్భంగా ఉటంకించారు. ఆయన నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్‌ అభ్యర్థి, దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మిత్రుడు అయిన మైక్‌ రోజర్స్‌తో తలపడతారు. విజయం ఆయనను వరిస్తే అమెరికా సెనెట్‌లో అడుగు పెట్టే మొట్టమొదటి ముస్లిం అవుతారు.

'రాజకీయాల నుంచి డబ్బును దూరం చేసి దానితో మీ జేబు నింపే మెడికేర్‌ పథకాన్ని అమలు చేయడమే నా లక్ష్యం. ఇది ఓ మహోద్యమం' అని సయీద్‌ చెప్పారు. కాగా డెమొక్రటిక్‌ పార్టీ నామినేషన్‌ను గెలుచుకున్న సయీద్‌ను ఆయన ప్రత్యర్థి హేలీ స్టీవెన్స్‌ అభినందించారు. 'ఆయన ఓ వైద్యుడు. కమ్యూనిటీ ఆరోగ్య అధికారి. స్కాలర్‌. అంకితభావం కలిగిన వ్యక్తి. సాధారణ ఎన్నికలలో మైక్‌ రోజర్స్‌తో తలపడనున్న నేపథ్యంలో ఆయనకు నా మద్దతును అందించడం గర్వంగా ఉంది' అని ఆమె అన్నారు. కాగా ఈ ఫలితంపై అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానిస్తూ ఇది రిపబ్లికన్లకు మంచి వార్త అని చెప్పారు. ఎల్‌-సయీద్‌కు ప్రచార సమయంలో వామపక్ష నేతలు వెర్మంట్‌ సెనెటర్‌ శాండర్స్‌, న్యూయార్క్‌ నగర కాంగ్రెస్‌ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్‌ తదితరులు మద్దతుగా నిలిచారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్