Jun 11,2021 12:56

తిరువనంతపురం : లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సినీ దర్శకురాలు ఆయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. ప్రఫుల్‌ కేంద్రం పంపిన జీవాయుధమని, కోవిడ్‌ను నియంత్రించడంలో విఫలమయ్యారంటూ ఆమె మండిపడ్డారు. దీంతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఓ న్యూస్‌ చానల్‌ డిబేట్‌లో పాల్గొన్న ఆమె.. 'లక్షద్వీప్‌లో గతంలో కేసులో లేవు. ఆయనొచ్చాక ఇప్పుడు ప్రతి రోజు 100కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కేంద్రం ఇక్కడకు జీవాయుధాన్ని పంపిందని స్పష్టంగా చెప్పగలను' అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బిజెపి కార్యకర్తలు పెద్ద రాద్ధాంతం చేశారు. వీధుల్లో నిరసన తెలిపారు. బిజెపి లక్షద్వీప్‌ చీఫ్‌ సి.అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నిరసనలపై కూడా ఆమె తీవ్రంగా మండిపడ్డారు. తాను చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. 'వారు నాపై దేశ ద్రోహం కేసు పెట్టారు. కాని ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని చెప్పగలను. తనపై బిజెపి కార్యకర్త ఫిర్యాదు చేశారు. నేను జన్మించిన ఈ భూమి కోసం పోరాటాన్ని కొనసాగిస్తాను. ఎవ్వరికీ భయపడేది లేదు. ఇప్పుడు నా గొంతు మరింత పెద్దదవుతుంది' అని అన్నారు. కాగా, బిజెపి తీరును కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. దేశద్రోహం అనే వ్యాఖ్యలను దుర్వినియోగపర్చడం ద్వారా వేధింపులకు పాల్పడుతోందని అన్నారు. హింసను ప్రేరేపించని, హద్దు మీరని వ్యాఖ్యలు ప్రభుత్వంపై చేస్తే దేశద్రోహం కాదని, సుప్రీంకోర్టు ఇదే చెబుతున్నా... వివిధ రాష్ట్రాల్లోని పోలీసులు దీన్ని విస్మరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆశిషాపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.