Oct 28,2021 15:32

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఘటనలో అమరులైన రైతుల అస్థికలను రైతు సంఘాల సమన్వయ కమిటీ, వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలో గోదావరిలో నిమజ్జనం చేశారు. తొలుత అమరవీరుల అస్థికలను శ్యామలాసెంటర్‌ నుంచి కుమారి థియేటర్‌ వద్ద గల ఘాట్‌ వరకూ ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నరసింహరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నల శివశంకరరావు, జిల్లా నాయకులు పి.రామకృష్ణులు మాట్లాడారు. ఏడాది కాలం నుంచి రైతులు మొక్కవోని దీక్షతో మోడీ తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఆ చట్టాలను రద్దు చేయకపోగా రైతు ఉద్యమంపై తీవ్రమైన అణచివేతను, నిరంకుశత్వాన్ని ప్రదర్శించడం దారుణమన్నారు. లఖింపూర్‌ ఖేర్‌లో బిజెపి. మంత్రి కుమారుడు రైతులను జీపుతో తొక్కించి నలుగురు రైతుల మృతికి కారణమవ్వడం బిజెపి, మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని అన్నారు. రైతు అమరవీరుల పోరాట స్ఫూర్తి వృథా కాదని, వారి పోరాటపటిమను దేశమంతా ప్రసరింపచేయడానికే ఆ అమరవీరుల అస్థికలను దేశంలోని అన్ని ప్రాంతాలలో వున్న నదుల్లో నిమజ్జనం చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే గోదావరిలో కలిపినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిఐటియు రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌.మూర్తి, సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టిఎస్‌.ప్రకాష్‌, సిపిఎం నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు సావిత్రి, జరీన, పూర్ణ, తులసి, ఎడ్ల లక్ష్మి, బ్రమరాంభ, భాగ్యలక్ష్మి, సునీత, పవన్‌, రాజులోవ, రాజ, సుబ్రహ్మణ్యం, ప్యారీ, కృష్ణ, రామకృష్ణ, జి.భాస్కర్‌, పూర్ణిమరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.