Jun 11,2021 08:42

న్యూఢిల్లీ: లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌పై సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం రాజ్యసభ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. లక్షద్వీప్‌లో పర్యటించేందుకు అనుమతి నిరాకరించి తన ప్రత్యేక హక్కులను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయన లేఖ రాశారు. ప్రఫుల్‌ తీసుకున్న నిర్ణయాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ పార్టీ క్యాడర్‌ను, ప్రజలను కలిసేందుకు అవకాశం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మే 26న లక్షద్వీప్‌లో తన పర్యటనకు సంబంధించి అధికారులకు సమాచారం అందించానని, కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా తన పర్యటన ఉంటుందని హామీ కూడా ఇచ్చానని తెలిపారు. తన అభ్యర్థనపై స్పందించేందుకు అధికారులు ఐదు రోజుల సమయం తీసుకున్నారని, చివరకు కరోనా నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకోవాలంటూ కరవత్తి అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ నుంచి సమాధానం వచ్చిందని తెలిపారు.
కరోనా ప్రభావం ప్రారంభమైన గతేడాదిలో వైరస్‌కు లక్షద్వీప్‌ దూరంగా ఉండగలిగిందని పేర్కొన్నారు. ప్రఫుల్‌ పటేల్‌ కొత్త అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన తర్వాత క్వారంటైన్‌ సడలింపునకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, ఫలితంగా అక్కడ నాలుగు వేల మేర కేసులు వెలుగుచూశాయని, ఇప్పటికే 20 మంది మరణించారని విశ్వం తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ద్వీపాన్ని సందర్శించకుండా కరోనా పేరుతో అడ్మినిస్ట్రేటర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. లక్షద్వీప్‌ ప్రజల జీవనశైలి, జీవనోపాధి, సంస్కృతిని దెబ్బతీసే విధంగా, పౌర స్వేచ్ఛను హరించేలా అనేక ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఆమోదయోగ్యం కాని, అక్కడి ప్రజలకు హానికరమైన ఇటువంటి నిర్ణయాలను కొనసాగించడం సరికాదని ఎంపి విశ్వం స్పష్టం చేశారు.