Oct 27,2021 23:49

లింగంబోడులో విచారణ చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి -అవుకు: అవుకు మండలం లింగంబోడు గ్రామంలో రజకుల గ్రామ బహిష్కరణ విషయంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో తహశీల్దార్‌ శ్రీనివాసులు, బనగానపల్లె సిఐ సుబ్బరాయుడు, మండల అభివృద్ధి అధికారి అజాంఖాన్‌ మాట్లాడుతూ గ్రామానికి చెందిన రజక కుటుంబాలకు గతంలో ప్రభుత్వం ఈనామ్‌ కింద భూములను ఇచ్చిందని తెలిపారు. 1956 ఈనామ్‌ యాక్ట్‌ ప్రకారం పట్టాలను కూడా సంబంధిత రజకుల కుటుంబాలకు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ మూడు కుటుంబాలను గ్రామంలో పెద్ద మనుషులు గ్రామ బహిష్కరణ చేశారని నంద్యాల సబ్‌ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై విచారణ కోసం వచ్చామని, ఏదైనా సమస్య ఉన్నట్లయితే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. బహిష్కరణ చేయడం చట్టరీత్యా నేరమని ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడవద్దని తెలిపారు. గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి మెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవుకు ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ తహశీల్లార్‌ ప్రసాద్‌బాబు, ఎఎస్‌ఐ బాబా ఫక్రుద్దీన్‌, ఇఒఆర్‌డి మహేందర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంగళరెడ్డి, గ్రామస్తులు, పెద్ద మనుషులు పాల్గన్నారు.