Nov 25,2021 22:03

నేషన్‌ ఫర్‌ ఫార్మర్స్‌ తరపున ప్రకటించిన సాయినాథ్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి నిజాయితీగా పరిష్కారం చూపేందుకు 'స్వతంత్ర రైతు కమిషన్‌'' ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషన్‌ ఫర్‌ ఫార్మర్స్‌ వేదిక గురువారం ప్రకటించింది. ప్రతిపాదిత కమిషన్‌లో వ్యవసాయ రంగ నిపుణులు, కార్యకర్తలు, రైతు సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సీనియర్‌ పాత్రికేయులు, మెగసేసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ గురువారం నాడిక్కడి ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (పిసిఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న దుస్థితి, ఈ రంగంతో ముడిపడివున్న వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులు, కోళ్ల పరిశ్రమకు చెందిన వారిపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ కమిషన్‌ అవసరమెంతైనా ఉందని అన్నారు. రైతులకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన పత్రికా గోష్టిలో ఆయన మాట్లాడుతూ, మూడు వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టడంలో రైతులు సాధించిన విజయం తిరుగులేనిదని అన్నారు. ఈ చట్టాలు కేవలం వ్యవసాయానికి మాత్రమే పరిమితమైనవి కావు, పౌరుల ప్రాథమిక హక్కులను కూడా హరించేటటువంటివి అని ఆయన చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం (ప్రోత్సాహం, వీలుకల్పించడం) 2020 లోని 17,18 సెక్షన్లు రాష్ట్రాల నిర్ణయాధికార హక్కుల్లోకి మోడీ ప్రభుత్వ చొరబాటును తెలియజేస్తున్నాయని అన్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండా, వాటి ఆమోదం లేకుండా కోట్లాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని కేంద్రం ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌, వేలాది మంది న్యాయవాదులు రాష్ట్రపతికి రాసిన లేఖలో ఘోషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుతో రైతులకు న్యాయం చేకూర్చేందుకు మార్గం సుగమం చేస్తుందని, దీనిలో భాగమే స్వతంత్ర రైతు కమిషన్‌ అని అయన చెప్పారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి సంబంధించి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలని రైతులు చేసిన డిమాండ్‌ ముమ్మాటికీ సరైనదని ఆయన అన్నారు. వ్యవసాయానికి అయ్యే మొత్తం ఖర్చుకు అదనంగా 50 శాతం లాభం కలిపి ఎంఎస్‌పి ధర ప్రకటించాలన్న స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసును నాడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యపిఎ ప్రభుత్వం, ఆ తరువాత వచ్చిన 2004 డిసెంబర్‌లో తన తొలి నివేదిక, 2006 అక్టోబర్‌లో ఐదో (చివరి) నివేదిక ఇచ్చిందని తెలిపారు. సి2 ప్లస్‌ 50 శాతంతో కనీస మద్దతు ధర ఇవ్వాలని స్పష్టం చేశారని, 16 ఏళ్లగా ఆ కమిషన్‌ సిఫార్సులను అమలు బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కాయని సాయినాథ్‌ విమర్శించారు. ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఒక కమిటీ వేసిందని, ఆ కమిటీలో రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నవారే సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇప్పటివరకు బయటకు రాలేదని, ప్రభుత్వాలకు అనుకూలంగా లేకపోతే రిపోర్టులను బయటపెట్టరని సాయినాథ్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల ముందుకు రైతులు రావటం లేదని, ఆ కమిటీలపై రైతులకు నమ్మకం లేదని అన్నారు. అందుకే తాము కిసాన్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని, రైతుల వాస్తవ సమస్యలు, పరిష్కారాలు చూపేందుకు కమిషన్‌ పని చేస్తుందని తెలిపారు. దేశంలోని రైతులంతా ఎంఎస్‌పి చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని, చదువుకోని రైతు కూడా ఎంఎస్‌పి గురించి స్పష్టంగా చెబుతున్నాడని చెప్పారు. వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చట్టాలను రద్దు చేశారని, ఇటీవలి ఉప ఎన్నికల్లో ఘోర వైఫల్యంతో మోడీ ప్రభుత్వం ఆలోచనలో పడిందని పేర్కొన్నారు. వ్యవసాయ సంక్షోభం, రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ, రైతులు గురించి చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా ఎంఎస్‌పి రావడం లేదని, వారు కూడా ఎంఎస్‌పి కోసం డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు.
కార్పొరేట్లకే మోడీ క్షమాపణలు : అశోక్‌ దావలే
ఇటీవల ప్రధాని మోడీ క్షమాపణలు దేశ ప్రజలకు చెప్పలేదని, తన కార్పొరేట్‌ స్నేహితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో వారికి క్షమాపణలు చెప్పారని ఎఐకెఎస్‌ జాతీయ అధ్యక్షుడు అశోక్‌ దావలే ఎద్దేవా చేశారు.. దేశంలోని రైతుల సమస్యలపై కిసాన్‌ కమిషన్‌ అవసరమని, దానికి ఎఐకెఎస్‌, ఎస్‌కెఎం మద్దతుతోపాటు సహకారం అందిస్తాయని తెలిపారు. ఇది రైతుల అనుకూల కమిషన్‌ అని పేర్కొన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను చేయకపోవడం దేశంలోని రైతాంగం దుస్థితికి కారణమైందని తెలిపారు. ఏడేళ్ల మోడీ పాలనలో అక్టోబర్‌ 3న లఖింపూర్‌ ఖేరీలో రైతులపై జరిగిన మారణకాండ పరాకాష్టకు నిదర్శనమని అన్నారు. గతంలో రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకుంటామని మోడీ సర్కార్‌ హామీ ఇచ్చిందని, ఇప్పుడు శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో విద్యుత్‌ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం జాబితా చేసిందని తెలిపారు. దీన్ని మోడీ మోసంగా చెప్పకూడదా? అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ నేత దినేష్‌ అబ్రోల్‌, ఫోరం ఫర్‌ రైట్‌ టూ ఎడ్యూకేషన్‌ సభ్యులు జగ్‌మోహన్‌ సింగ్‌, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంఘం నేత సబాస్టియన్‌, బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం నేత థామస్‌ ఫ్రంక్‌, మహిళ నేత నవశ్రాన్‌ సింగ్‌ పాల్గొన్నారు.