Dec 02,2021 11:58

తిరువనంతపురం :  రాష్ట్రంలో గత నెల పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటినుండి కేవలం వెయ్యికంటే తక్కువ మంది విద్యార్థులు, 300 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యలో దీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. అనంతరం నవంబర్ 1 నుండి రాష్ర్ట వ్యాప్తంగా  పాఠశాలలు  ప్రారంభమయ్యాయి.   వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా పరీక్షల నిర్వహణలో అధికారులు చేపడుతున్న విస్తృత చర్యలు, అలాగే ప్రజల నుండి వస్తున్న స్పందన ప్రభావవంతంగా ఉన్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నాటి నుండి సుమారు 40 లక్షలకు పైగా విద్యార్థులు, 1.75 లక్షల ఉపాధ్యాయులు తరగతులకు హాజరవుతున్నారు. అలాగే కేరళలోని ఏ పాఠశాలలు కూడా కరోనా హాట్‌స్పాట్‌లుగా మారలేదని, అయినప్పటికీ మూసివేశామని.. అయితే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని, కరోనా కేసులు పెరగడంతో పాఠశాలలు మూసివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.  

పాఠశాలల పున: ప్రారంభంలో ఆందోళన ...
దేేశంలోనే కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. నవంబర్‌    ఒకటి నుండి  పాఠశాలలను పున: ప్రారంభించడంతో ఆందోళన నెలకొంది. అయితే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగానే కాకుండా.. 40 శాతం మంది చిన్నారుల్లో వ్యాధిని ఎదుర్కొనే ప్రతిరోధకాలు ఉన్నాయని సీరో సర్వేలో తేలింది. ఈ అంశాను పరిగణనలోకి తీసుకుంటే.. పాఠశాలలు ప్రారంభమైన రెండు వారాల అనంతరం ప్రభుత్వ అధికారులు మహమ్మారి ప్రభావాన్ని ఊహించారు. అయితే అప్పటికే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. నవంబర్‌ ప్రారంభంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు భయపడ్డారు. విద్య,ఆరోగ్య శాఖలు సంయుక్తంగా రూపొందించిన మార్గదర్శకాలను శ్రద్ధగా అనుసరించడంతో మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోగలిగారు. విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించి బయోబబుల్‌ను రూపొందించడం, ఒకేసారి హాజరుకాకుండా షిఫ్ట్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం, కరోనా ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండటం, నివారణ చర్యలు అమలుచేయడం చేపట్టడంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగారు.

సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక
విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎ.పి.ఎం. మొహమ్మద్‌ హనీష్‌, హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డా.రాజన్‌ల నేతృత్వంలోని బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ సూచనలను జనరల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కె.జీవన్‌ బాబు నేతృత్వంలోని విద్యాశాఖ అధికారులు కచ్చితంగా అమలు చేశారు. పాఠశాల నుండి రాష్ట్రస్థాయి వరకు కరోనా సమాచారంపై రోజువారీగా విశ్లేషణ చేపట్టారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, స్థానిక అధికారులు, రవాణా శాఖల పూర్తి సహకారంతో అవాంతరాలు లేకుండా భద్రతతో కూడిన పాఠశాల విద్యను అందించగలిగింది. అన్ని రాజకీయపార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా మద్దతునిచ్చాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైనా కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే క్వారంటైన్‌కు తరలించడం జరిగిందని, ఈ చర్యలు వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు సహాయపడ్డాయని కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌ కుట్టి పేర్కొన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండటంతో మా బృందం కృషి విజయవంతమైందని రుజువుచేసిందని ఆయన అన్నారు.