
బెంగళూరు : కర్ణాటక చిక్‌బళ్లాపూర్‌లోని ఒక క్వారీలో మంగళవారం ఉదయం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారు. హిరంగవల్లిలోని క్వారీలో మైనింగ్‌కు వినియోగించే జిలిటెన్ స్టిక్స్ ప్రమాదవశాత్తు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పేలుడుకు జిలిటెన్ స్టిక్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారంటూ స్థానికుల నుండి ఫిర్యాదులు అందడంతో పాటు గత నెల ఇదే తరహా ఘటన జరగడంతో.. ఈ నెల 7న క్వారీలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే జిలిటెన్ స్టిక్స్‌ను వినియోగించవద్దని కాంట్రాక్టర్‌ను ఆదేశించామని అన్నారు. అయితే క్వారీ యాజమాన్యం ఆదేశాలను పట్టించుకోకుండా.. అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ చేసిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన క్వారీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ప్రమాదస్థలాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ సందర్శించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. చిక్‌బళ్లాపూర్ ప్రమాదంలో ఆరుగురు మరణించడం బాధ కలిగించిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, జనవరి 22న శివమొగ్గలోని క్వారీలో జరిగిన ఇదే తరహా ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.