Nov 30,2020 22:00

ఆందోళన చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి- టెక్కలి : మండలంలోని గూడేం పంచాయతీ పరిధిలో సవరకిల్లి వద్ద ఉన్న హిమవంత్‌రెడ్డి స్టొన్‌ క్రషర్‌ క్వారీ ఆనుమతులను తక్షణమే రద్దు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక భూగర్భ గనులశాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. క్వారీ నిర్వహణ వల్ల తమ కుటుంబాలు ఆనారోగ్యానికి గురవుతున్నాయని, తమ గ్రామానికి చెందిన శ్మశానవాటికనూ ఆక్రమించుకుని యజమాని నిర్మాణం చేపట్టడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని అన్నారు. గ్రామదేవత ఆలయ స్దలాన్నీ ఆక్రమించుకున్నారని, స్థానికంగా ఉన్న తమకు ఉపాధి కల్పించడం లేదని అన్నారు. క్వారీ నిర్వహణ వల్ల భయబ్రాంతులకు గురవుతున్నామని వాపోయారు. స్థలాల ఆక్రమణ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం కార్యాలయ ఎఒకు వినతిపత్రం అందజేశారు. ఆందోళనకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వంకల మాధవరావు, గిరిజన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు సలాస షణ్ముఖరావు, అరునోదయ సంఘ జిల్లా కార్యదర్శి కె.సోమేశ్వరరావులు నాయకత్వం వహించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన జన్ని కాంతారావు, నాగేశ్వరరావు, సరస్వతి, సూర్యనారాయణ, పాపమ్మ పాల్గొన్నారు.