Feb 09,2021 07:48

చిత్తూరు ప్రతినిధి: చంద్రబాబునాయుడుకు కంచుకోటగా ఉన్న కుప్పంపై వైసిపి కన్ను వేసింది. వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను తమ ఖాతాలోకి వేసుకోవాలని, తద్వారా టిడిపిని నైతికంగా దెబ్బతీయాలనే వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నియోజకవర్గంలోని ముఖ్యనాయకులకు ఆ పార్టీ వల వేస్తోంది. నయానో, భయానో వారిని లాక్కుంటోంది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారని సమాచారం. గతంలో టిడిపికి ఏకపక్షంగా జరిగే పంచాయతీ ఎన్నికలు... ఈసారి పోటాపోటీగా మారింది.
                                                   ఏడు సార్లు విజయం
కుప్పం నియోజకవర్గం చంద్రబాబునాయుడుకు తిరుగులేని ప్రాంతం. 1989 నుంచి ఆయన్ను ఇక్కడి జనం ఆదరిస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఇది కంచుకోటగా మారింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయనకు భారీమెజారిటీ కట్టబెడుతున్నారు ఇక్కడి ప్రజలు.  గడిచిన రెండు ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినా ఆయనకు ఎప్పుడూ ఇక్కడ తిరుగులేదు. ఈ నియోజకవర్గవం నుంచి ఆయన ఇప్పటి వరకు ఏడుసార్లు విజయబావుటా ఎగుర వేశారు.
                                                  దెబ్బకొట్టేందుకు వైసిపి పావులు
ఇలాంటి కంచుకోటలో చంద్రబాబును ఇక్కడ దెబ్బకొట్టాలని వైసిపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కుప్పం నియోజక వర్గంలో చంద్రబాబు తొలి రెండు రౌండ్లలో వెనుకబడ్డారు. దీనిపైన వైసిపి తీవ్రంగా ఆలోచిస్తోంది. గట్టిగా ప్రయత్నిస్తే ఇక్కడ టిడిపిని దెబ్బతీయడం పెద్ద విషయం కాదని పథకం రచిస్తోంది. సొంత గడ్డపై చంద్రబాబును దెబ్బతీస్తే ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుందని వారి ఆలోచనగా వుంది. దీంతో పంచాయతీ ఎన్నికలకు ముందే ఇక్కడ భారీ ఎత్తున వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇందులోభాగంగా కుప్పం నియోజక వర్గంలో గతేడాది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు సార్లు పర్యటించి పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. అంతేకాకుండా వైసిపి ప్రభుత్వం కుప్పంలో మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేసింది. తద్వారా చంద్రబాబుకన్నా తాము ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
                                                   ముఖ్యనాయకులకు వల
ఈ వ్యూహాత్మ అడుగుల్లో భాగంగా టిడిపితో 30ఏళ్ళకు పైగా అంటిపెట్టుకుని ఉన్న మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ను వైసిపిలోకి లాక్కున్నారు. అలాగే ఇదివరకు సిడిసిఎంఎస్‌ చైర్మన్‌గా ఉన్న శ్యామరాజ్‌ కూడా టిడిపిని వదిలేశారు. ఇక శాంతిపురంలోని జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌‌ సుబ్రమణ్యంరెడ్డి కూడా ఈ దిశగా అడుగులేస్తున్నారని జోరుగా చర్చసాగుతోంది. వీరితో పాటు ద్వితీయశ్రేణిలో కీలకంగా ఉన్న నాయకులు సైతం క్రమంగా వైసిపి వైపు వెళుతున్నారు.
                                                    ఏకగ్రీవాలపై దృష్టి
ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజక వర్గంలో సగం పంచాయతీల్లోనైనా తమ పార్టీ పాగా వేస్తే చంద్రబాబునాయుడిని నైతికంగా దెబ్బతీసినట్లేనని వైసిపి భావిస్తోంది. దీనికితోడు ఈ దఫా పంచాయతీల్లో పోటీకి దిగేందుకు టిడిపి నాయకులు తటపటాయిస్తున్నారు. ఒకవేళ పంచాయతీల్లో గెలిచినా అధికార పార్టీ దగ్గర తట్టుకోగలుగుతామా..? అని ఆలోచిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వైసిపి ఈ నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై దృష్టి పెట్టింది.